ప్రజాశక్తి అనంతపురం కలెక్టరేట్ : శ్రీరామ్ రెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న కార్మికుల నిరవధిక సమ్మెను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పోలీసులు బలవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రధాన పంపు మోటార్లను పోలీసులు బలవంతంగా ఆన్ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ శ్రీరామ్ రెడ్డి కార్మికులు, సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేసి మోటార్లను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ బకాయి వేతనాలు, పిఎఫ్, ఈఎస్‌ఐ బకాయిలు, గ్రాడ్యుటీ చెల్లించాలని అనేకమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా, శాంతియుత నిరసనలు చేపట్టిన, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఇన్ని రోజులు వేతనాలు అందకపోయినా సమస్యలు ఎదుర్కొని కార్మికులు పనిచేస్తూ వచ్చారన్నారు. నెలలు తరబడి వేతనాలు రాకపోతే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రభుత్వం ఆలోచించాలన్నారు. గత్యంతరం లేని సమయంలో కార్మికులు నిరోధిక సమ్మెకు దిగాల్సి వచ్చింది అన్నారు. ప్రభుత్వం, అధికారులు కార్మికుల పక్షాన స్పందించి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి సమ్మె విరమింపజేసే విధంగా కార్మికులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తక్షణమే బకాయి ్ వేతనాలు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలా కాకుండా బలవంతంగా సమ్మె నిలుపుదల చేస్తామంటే సిఐటియుగా ఒప్పుకునేది లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలు ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.










