Sep 22,2023 21:28

కార్మికుల దీక్షలకు సంఘీభావం తెలుపుతున్న జెఎసి నాయకులు

ప్రజాశక్తి - సాలూరురూరల్‌ : ఎపి ఫైబర్స్‌ జ్యూట్‌ మిల్లు యాజమాన్యం కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని విడనాడి, మిల్లు తెరిచేందుకు కృషి చేయాలని జ్యూట్‌ మిల్లు కార్మిక జెఎసి వెల్లడించింది. మండలంలోని జీగిరాం జ్యూట్‌ మిల్లు కార్మికులు 32వ రోజు దీక్షా శిబిరం వద్ద జెఎసి నాయకులు కె.శ్రీనివాసరావు, ఎన్‌వై నాయుడు, సింహాచలం, సూరప్పలనాయుడు మాట్లాడుతూ ఎసిఎల్‌, జెసిఎల్‌ సమక్షంలో చర్చలు జరిగితే యాజమాన్యం సహకరించకపోవడమంటే, కార్మిక ఆందోళనను లెక్కచేయకపోవడమే అవుతుందని అన్నారు. ఇలాంటి వైఖరి యాజమాన్యం తీసుకుంటే, భవిష్యత్తులో జరిగే ఆందోళన, పోరాటాలకు, యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్మిక వర్గం ఓపికతో శాంతియుతంగా ఆందోళన చేస్తుందని, ప్రభుత్వం, యాజమాన్యం మిల్లు తెరవడానికి కృషి చేయాలని, లేకుంటే భవిష్యత్తులో జరిగే తీవ్ర ఆందోళనకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఉపముఖ్యమంత్రి పి.రాజన్నదొరకు కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని జెసిఎల్‌కు లేఖ రాయడం జరిగిందని, ఆ లేఖను కూడా యాజమాన్యం పట్టించుకోలేని పరిస్థితి నెలకొందని ఇది నిర్లక్ష్యమే అవుతుందనినాయకులు తెలిపారు. కార్మిక జెఎసి పోరాటానికి అన్ని పక్షాలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు సుదర్శన్‌, సింహాచలం పాల్గొన్నారు.