May 02,2023 01:05

బహుమతులు ప్రదానం చేస్తున్న తులసిదాస్‌, హరికిషోర్‌

ప్రజాశక్తి-తాడేపల్లి : కార్మికులు, కష్టజీవులు తరఫున ప్రజాశక్తి నికరంగా పనిచేస్తుందని ప్రజాశక్తి ఎడిటర్‌ తులసీదాస్‌ చెప్పారు. మే డే సందర్భంగా పట్టణంలోని ప్రకాష్‌నగర్‌ ప్రజాశక్తి డెయిలీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో సోమవారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కాజ నుండి వచ్చిన చిన్నారులు ప్రదర్శించిన కోలాటం అందరి అభినందనలు పొందింది. ప్రజాశక్తి సిబ్బంది కుటుంబంలోని చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తొలుత మేడే జెండాను మారుతి శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ మేనేజర్‌ టివి సురేష్‌రాజు అధ్యక్షతన నిర్వహించిన సభలో తులసీదాస్‌ మాట్లాడుతూ 8 గంటల పనిదినం కోసం కార్మికులు రక్తతర్పణం గావించిన రోజు మేడే స్ఫూర్తితో ప్రజాపోరాటాలకు ఆలంబనంగా ప్రజాశక్తి నిలుస్తుందని పేర్కొన్నారు. అరుణపతాకను కార్మికులకు, కష్టజీవులకు అందించిన ఈరోజు కార్మికవర్గం ప్రతినబూని, పట్టుదలతో పనిచేయాల్సి ఉందని చెప్పారు. ప్రజాశక్తి సిబ్బంది మొత్తం ఆ ఒరవడి కొనసాగించాలని కోరారు. నేటికీ దోపిడీకి గురవుతున్న శ్రామికులకు, కార్మికులకు దిక్సూచిలా ప్రజాశక్తి నిలబడుతుందని, ప్రతి అక్షరం ప్రజల పక్షం వహిస్తున్న ప్రజాశక్తికి ప్రజలు తమ అండదండలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ హరికిషోర్‌, సిజిఎం వై.అచ్యుతరావు, కె.గడ్డన్న, హెచ్‌ఆర్‌ జనరల్‌ మేనేజర్‌ తోడర్‌మల్‌, మహిళా శాఖ కార్యదర్శి భవానీ, పద్మ, ప్రజాశక్తి సిబ్బంది పాల్గొన్నారు.