Sep 30,2023 22:12

దీక్షనుద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు

           హిందూపురం : అధికారాన్ని అడ్డుపెట్టుకుని పుట్టపర్తి ఎమ్మేల్యే శ్రీధర్‌రెడ్డి తన బినామీ గోవర్దన్‌రెడ్డి ద్వారా కార్మికుల కష్టార్జితాన్ని కాజేశారని, అధికారులు దీనిపై విచారణ జరిపి కార్మికులకు రావాల్సిన డబ్బులను వారికి చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్‌ చేశారు. నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి వాటర్‌ సప్లరు స్కీమ్‌లో పని చేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని, వేతనాల్లో కోత విధించిన డబ్బులను తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన నిరవధిక దీక్షలు 33వ రోజుకు చేరుకున్నాయి. శనివారం నాడు గ్రామీణ నీటి పారుదల శాఖ డీఈ కార్యాలయం ముందు కార్మికులు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ హిందూపురం డివిజన్‌లో నీలకంఠపురం శ్రీ రామిరెడ్డి విభాగంలో 52 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరికి ప్రభుత్వం నుంచి నెలకు రూ.18వేలు వేతనాలు ఇస్తుంటే ఇందులో రూ.1200 పిఎఫ్‌తో పాటు రూ.2800 కోత విధించారన్నారు. ఎఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ జినామీ గోవర్ధన్‌ రెడ్డిని అడ్డుపెట్టుకుని అడ్డంగా కార్మికుల సోమ్మును కాజేశారన్నారు. దీంతో పాటు పిఎఫ్‌ ఖాత జమ చేయాల్సిన నిధులను 18 నెలల నుంచి జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై అధికారులు విచారణ జరిపి కార్మికులకు మోసం చేసిన గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జెడ్పీ శ్రీనివాసులు, పుట్టపర్తి గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, హిందూపురం డివిజన్‌ యూనియన్‌ నాయకులు సోమశేఖర్‌, రామాంజనేయులు, నాగేంద్ర, మురళి, గిరీష్‌ పాల్గొన్నారు.