Oct 01,2023 00:57

మహాసభలో మాట్లాడుతున్న నేతాజి

ప్రజాశక్తి-గుంటూరు : కార్మిక వర్గ ఐక్యత కోసం జీవితాంతం కృషి చేసిన ధన్యజీవి పర్స సత్యనారాయణ అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ అన్నారు. సిఐటియు గుంటూరు తూర్పు నగర కమిటీ మహాసభ పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో టి.రాధా అధ్యక్షతన శనివారం జరిగింది. తొలుత పర్స సత్యనారాయణ చిత్రపటానికి భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) నగర సీనియర్‌ నాయకులు ఎన్‌.మస్తాన్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నేతాజీ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలు దేవాలయాలు అని భారతదేశ మొదటి ప్రధాని నెహ్రూ అంటే, ఇప్పటి ప్రధాని మోడీ మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలు పుట్టింది చావటానికేనని అనటం సిగ్గుచేటని మండిపడ్డారు. దేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో దారి మళ్లిస్తోందని, ప్రభుత్వం కార్మికులు ఎక్కడా నిరసన గళాలు విప్పకుండా ముందస్తు అరెస్టులు గహనిర్బంధాలకు పాల్పడుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో కార్మికులందరూ ఐక్యమై తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం 16 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా టి.రాధ, కట్లగుంట శ్రీనివాసరావు, కోశాధికారిగా గండికోట శంకర్రావు ఎన్నికయ్యారు. సిఐటియు పశ్చిమ కమిటీ ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు, కార్మికులు టి.శ్రీనివాసరావు, పి.దీవెనరావ్‌, ముఠా కార్మికులు బి.వెంకటేశ్వర్లు, జోజి, అంగన్వాడీ వర్కర్స్‌ రోజమ్మ, ఆశా వర్కర్స్‌ కెజియ, పాల్గొన్నారు.