Jul 06,2023 23:52

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి

ప్రజాశక్తి-అనకాపల్లి
జిల్లాలోని అన్ని రకాల పరిశ్రమలలో కార్మికుల భద్రతకు సంబంధించిన ముందస్తు రక్షణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి అధికారులను ఆదేశించారు. కర్మాగారాలలో కార్మికుల భద్రతకు సంబంధించి గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న 301 పరిశ్రమలలో పారిశ్రామికేతర రంగాలకు చెందిన 95 సంస్థలు మినహా మిగిలిన 206 కర్మాగారాలలో భద్రతకు సంబంధించి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే 186 పరిశ్రమలలో చేపట్టవలసిన అంశాలను తెలియజేశామని అధికారులు తెలిపారు. భద్రత రక్షణ చర్యలపై ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్లు, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ అధికారులు వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరారు. డిస్ట్రిక్ట్‌ క్రైసిస్‌ గ్రూపు ఏర్పాటు చేయాలన్నారు. వీటన్నింటిపై తీసుకున్న చర్యలపై యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టును వారం రోజుల్లో పంపించాలని జిల్లా కార్మికాధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్లను ఆదేశించారు. బాయిలర్‌ నిర్వహణపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని బాయిలర్స్‌ శాఖను కోరారు. కార్మికుల భద్రత, సంక్షేమంపై యాజమాన్యం దృష్టిపెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ల సలహాలను తీసుకోవాలన్నారు. అడిషనల్‌ ఎస్పీ విజయ భాస్కర్‌ మాట్లాడుతూ ప్రమాదాలు సంభవించేటప్పుడు ఏవిధంగా స్పందించాలనే విషయమై కార్మికులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా రియాక్టర్ల వద్ద పనిచేసేవారు సంబంధిత అంశంలో విద్యార్హత కలిగిన వారై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక అధికారి బుద్దా మునిస్వామి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ త్రినాథ్‌, ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్‌, కాలుష్య నియంత్రణ అధికారి, జిల్లా అగ్నిమాపక అధికారి పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.