
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా రామ్మోహన్ రారు
ప్రజాశక్తి - భీమవరం
కార్మికుల సంక్షేమాన్ని, భద్రతను గాలికొదిలేసి ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్ రారు విమర్శించారు. శనివారం భీమవరం ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులైన మహిళా కార్మికులను పరామర్శించారు. ఈ సందర్భంగా రారు మాట్లాడుతూ విఆర్‌ఆర్ పరిశ్రమలో విషవాయువులు తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళా కార్మికులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు ఇక్కడ పరిశ్రమలో సరైన సౌకర్యాలు, భద్రత, కనీస వేతనాలు లేక అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. తక్షణం సహాయక చర్యలు తీసుకోవడంతో పాటు కార్మికుల సంక్షేమం, కాలుష్యం నివారణ భద్రత వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించిన వారిలో సిఐటియు నాయకులు బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు, గొర్ల రామకృష్ణ, ఆక్వా పరిశ్రమల యూనియన్ నాయకులు ఎస్‌కె.భాష, నిజాముద్దీన్ ఉన్నారు.