సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్.నర్సింగరావు
విజయవంతమైన స్టీల్ సిఐటియు11వ మహాసభలు
ప్రజాశక్తి-ఉక్కునగరం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తే సహించేది లేదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం స్టీల్ సిఐటియు 11వ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే అధికారులు, ప్రజా ప్రతినిధులను తమ పోరాటాల ద్వారా గుణపాఠం చెప్తామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను కారుచౌకగా ప్రయివేటుకు కట్టబెట్టాలని కేంద్రప్రభుత్వం చూస్తోందని, కార్మిక వర్గం మరింత అప్రమత్తమై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతిఘటనలు మాత్రమే ప్రభుత్వ రంగాన్ని రక్షించగలవని దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయని, విశాఖ ఉక్కు అమ్మకానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం దిక్సూచి కావాలని పిలుపునిచ్చారు. ఉత్పత్తి చేసే కార్మిక శక్తి వ్యతిరేకించిన చోట పెట్టుబడిదారుల ఆగడాలు సాగవని,ఆ దిశగా మన ఉద్యమాన్ని నిర్మిద్దామన్నారు. దేశవ్యాప్తంగా అనేక పోరాటాలలో సిఐటియు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కార్మిక హక్కులతో పాటు ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో సిఐటియు కార్యకర్తలు సైనికుల్లా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు ప్రద్యుత్ ముకర్జీ, నబేంద్ర సర్కార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టి, కార్మికులను విచ్ఛిన్నం చేస్తోందని విమర్శించారు. మత విద్వేషాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను నిర్మించడంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ప్రాధాన్యతను సంతరించుకుందని, అందుకే ఈ ఉద్యమానికి పూర్తి సహకారం అందజేస్తామని స్పష్టం చేశారు.
ఏడు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం
మహాసభలో నూతన వేతనాలను తక్షణం అమలు చేయాలని, ఉత్పత్తికి అనుగుణంగా ఇన్సెంటివ్ చెల్లించాలని. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని,. నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని తదితర ఏడు తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.
స్టీల్ సిఐటియు నూతన కార్యవర్గం
అనంతరం స్టీల్ సిఐటియు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా జె అయోధ్యరామ్, యూనియన్ అధ్యక్షుడిగా వైటి. దాస్, ప్రధాన కార్యదర్శిగా యు రామస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పివిఎస్‌బి శ్రీనివాసరాజుతో పాటు 83 మంది కార్యవర్గసభ్యులుగాను, 14 మందిని కార్యదర్శివర్గ సభ్యులుగాను, 275 మందిని వర్కింగ్ కమిటీ సభ్యులుగా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
సిఐటియు బలోపేతంతోనే స్టీల్‌ప్లాంట్ మనుగడ
ఉక్కునగరం :స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించాలని స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్, సిఐటియు 13 మహాసభ తీర్మానించింది. శనివారం ఉక్కునగరం సిఐటియు కార్యాలయంలో స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్, సిఐటియు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోపన్యాసం చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్ మాట్లాడుతూ, సిఐటియు బలోపేతం అయితేనే స్టీల్‌ప్లాంట్‌కు మనుగడ ఉంటుందని గుర్తు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను మరింత ఉధృతంగా చేయాలన్నారు. మహాసభలను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు.
సిఐటియు సీనియర్ నాయకులు కే మల్లేశ్వరరావు యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఇటీవల మరణించిన ఆర్‌పి. రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పి శ్రీనివాసరాజు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇటీవల మరణించిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు మహాసభ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సిఐటియు రాష్ట్రఅధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ,కార్మికులంతా ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకోవాలన్నారు. సిఐటియు పోరాట విజయాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు జి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రమణ, కెఎం. శ్రీనివాస్, స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు ప్రద్యుత్ ముఖర్జీ, నంబెందు సర్కార్ పాల్గొన్నారు.










