ప్రజాశక్తి - ఏలూరు
సిఐటియు జిల్లా వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, కార్మికోద్యమ నిర్మాత అల్లూరు సత్యనారాయణ ధన్యజీవి అని పలువురు కొనియాడారు. అల్లూరు తొమ్మిదో వర్ధంతి సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరు చిత్రపటానికి బి.సోమయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ మాట్లాడుతూ అల్లూరు సత్యనారాయణ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సిఐటియు నిర్మాణం, అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. రైస్‌మిల్లు, బజారు జట్ల కార్మికులు, హమాలీలు, ఫ్యాక్టరీ, జ్యుట్‌మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి, కార్మిక సంఘాల ఏర్పాటుకు నిర్విరామ కృషి చేశారన్నారు. అల్లూరు సత్యనారాయణ ఆశయాల సాధనకు కార్యకర్తలంతా నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వి.సాయిబాబా, నేతలు పి.హైమావతి, కె.విజయలక్ష్మి, కె.రామాంజనేయులు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
నిడమర్రు: కార్మికుల, పేదల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అల్లూరు సత్యనారాయణ అని పలువురు కొనియాడారు. అల్లూరు సత్యనారాయణ తొమ్మిదో వర్థంతిని స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో కోన శ్రీనివాసరావు అధ్యక్షతన. మంగళవారం నిర్వహించారు. అల్లూరు చిత్రపటానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో కంచ వరప్రసాద్, కమిలి నాని, విజ్జురోతి పాపారావు, లావేటి చంద్రరావు, మింది బాపిరాజు, కన్నాజి సాయి పాల్గొన్నారు.










