ప్రజాశక్తి-అచ్యుతాపురం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు చెప్పారు. ఈ నెల 18, 19 తేదీల్లో పరవాడలో జరగనున్న సిఐటియు అనకాపల్లి జిల్లా 12వ మహాసభ కరపత్రాలను బుధవారం స్థానిక ఎస్‌ఇజెడ్ ప్రాంతంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని ఫార్మా, ఎస్‌ఇజెడ్‌తోపాటు చిన్న తరహా పరిశ్రమలు, పలు రంగాల్లో అసంఘటిత రంగ కార్మికులు, స్కీమ్ వర్కర్లు పని చేస్తున్నారని, వారికి కనీస హక్కులు అమలు కావడం లేదని తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగడం లేదని, దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాదిగా ఉన్న స్కీం వర్కర్లు రాజకీయ వేధింపులకు గురవుతున్నారన్నారు. ఈ సమస్యలపై మహాసభలో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. మహాసభ సందర్భంగా 18న పరవాడలో జరుగు భారీ ప్రదర్శన, బహిరంగ సభలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రొంగలి రాము, మండల కార్యదర్శి కూండ్రపు సోమునాయుడు, నాయకులు రాజు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.










