Sep 02,2023 21:22

వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు

కడప అర్బన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ. నాగరాజు పిలుపునిచ్చారు. శనివారం సిఐటియు జిల్లా వర్క్‌ షాప్‌ పాత బస్టాండ్‌లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. కులాల, మతాల మధ్య గొడవలు సష్టించి ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్‌ సెక్టార్‌ను తెగ నమ్ముతూ ప్రయివేటీకరణకు పూనుకోవడం అన్యాయమని తెలిపారు. స్కీం వర్కర్లకు రోజురోజుకూ బడ్జెట్‌ కుదించడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.23వేలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో సిఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తెలిపారు. ఈ వర్క్‌ షాప్‌లో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మనోహర్‌, జిల్లా కోశాధికారి బి. లక్ష్మీదేవి, కార్యదర్శిలు వెంకటసుబ్బయ్య, శ్రీనివాసులు, సత్యనారాయణ చారి, నాగేంద్ర, ఉపాధ్యక్షులు జి. చంద్రశేఖర్‌, ఆర్‌.లక్ష్మీదేవి, జిల్లా కమిటీ సభ్యులు విజరు కుమార్‌, అంజలీదేవి, సాల్మన్‌, రాఘవ, రవి, సురేష్‌, చంద్రారెడ్డి రిమ్స్‌ ,అంగన్వాడి, మున్సిపల్‌ విద్యుత్తు, ఐఎంఎల్‌, చైతన్య, ఆటో, బిల్డింగ్‌ రంగాల నాయకులు పాల్గొన్నారు.