Dec 01,2022 22:44

ప్రజాశక్తి-విజయవాడ
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పని చేయించి ,పెండింగ్‌ క్లయిమ్‌లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిర్మాణ కార్మికుల ఆల్‌ ఇండియా డిమాండ్స్‌ డే సందర్భంగా కృష్ణాజిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్వర్యంలో దేవినగర్‌ మూడు వంతెనల సెంటర్‌లో గురువారం నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిర్వర్యం చేయాలని, పథకాలు ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్మిక వ్యతిరేక ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్లు జారీ చేయడం దారుణమన్నారు. సిఎం వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి సంక్షేమ బోర్డులోని నిధులను వై.ఎస్సా.ఆర్‌ బీమా పేరుతో రూ''830 కోట్లు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ పేరుతో రూ''450 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరలించిపోయిందని, బోర్డు ద్వారా ఇచ్చే పథకాలను అపేసిందని అన్నారు. మిగిలి ఉన్న నిధులను కూడా తీసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్‌ సిటీ ఉపాధ్యక్షులు యం.బాబురావు మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో బిల్డింగ్‌ రంగం నగర నాయకులు జి.గోవిందు,కె.రాజేష్‌ ,సింహగిరీష్‌, వంగపాడు శంకర్‌, తిరుపతయ్య , బిల్డింగ్‌ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.