Aug 18,2023 21:51

మాట్లాడుతున్న తేజేశ్వరరావు

* కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలి
* మూసివేసిన ఇఎస్‌ఐ డిస్పెన్సరీలను తెరిపించాలి
* సిఐటియు నాయకుల డిమాండ్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వైద్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు విమర్శించారు. జిల్లాలోని కార్మికులకు వైద్యసేవలు అందించేందుకు పోరాడి సాధించుకున్న ఇఎస్‌ఐ డిస్పెన్సరీలను అర్ధాంతరంగా మూసివేయడం తగదన్నారు. తక్షణమే ఎచ్చెర్ల, శ్రీకాకుళంలో ఇఎస్‌ఐ డిస్పెన్సరీలను తిరిగి ప్రారంభించి, మందులు అందుబాటులో ఉంచి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లాస్థాయి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇఎస్‌ఐ పథకాన్ని బలోపేతం చేయాలని కోరారు. మూసివేసిన ఎచ్చెర్ల, శ్రీకాకుళం ఇఎస్‌ఐ డిస్పెన్సరీలను తెరిపించి వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించి కార్మికులకు వైద్యసేవలు అందించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఇఎస్‌ఐ రిఫరల్‌ హాస్పిటల్స్‌ ఏర్పాటు చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. వేల మంది కార్మికులున్న ఎచ్చెర్ల ప్రాంతంలో, జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో ఇఎస్‌ఐ డిస్పెన్సరీలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. 2019 మార్చిలో ఎచ్చెర్ల, శ్రీకాకుళంలో ఇఎస్‌ఐ డిస్పెన్సరీలు ఇఎస్‌ఐ కార్పొరేషన్‌ ప్రారంభించినా రాష్ట్ర ప్రభుత్వం వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంతో మూడేళ్లు అద్దె చెల్లించి కార్మికులకు ఎటువంటి సమాచారం లేకుండా గతేడాది సెప్టెంబరులో డిస్పెన్సరీలను మూసివేశారన్నారు. దీనివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలో వంద పడకల ఇఎస్‌ఐ ఆస్పత్రి లేకపోవడం వల్ల ప్రమాదానికి గురైన కార్మికులకు సకాలంలో సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 28 వేల మంది కార్మికుల నుంచి బీమాగా ఇఎస్‌ఐ కార్పొరేషన్‌కు నెలకు సుమారు రూ.1.50 కోట్లు చెల్లిస్తున్నా, కార్మికులు సరైన వైద్యం అందడం లేదని విమర్శించారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్య ఎదురైతే విశాఖపట్నం ఆరిలోవలోని ఇఎస్‌ఐ ఆస్పత్రికి వ్యయప్రయాసలతో జిల్లా నుంచి వెళ్లి రిఫరల్‌ రాయించుకోవాల్సి వస్తోందన్నారు. పైడిభీమవరంలో నిర్మిస్తున్న ఇఎస్‌ఐ పది పడకల డయాగస్టిక్‌ సెంటర్‌ నిర్మాణం కొన్ని ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదన్నారు. ఈ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. పైడిభీమవరం ఇఎస్‌ఐ డిస్పెన్సరీలో ఐదుగురు స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, జిల్లా కార్యదర్శి ఎన్‌.వి రమణ, ఎ.మహాలక్ష్మి, కోశాధికారి ఎ.సత్యనారాయణ, నాయకులు ఎన్‌.గణపతి, కె.సూరయ్య, ఎస్‌.లక్ష్మీనారాయణ, హెచ్‌.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.