ప్రజాశక్తి-అనకాపల్లి
అన్ని రంగాల కార్మికుల సమస్యలపై సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకరరావు అన్నారు. స్థానిక దొడ్డి రామునాయుడు భవనంలో సిఐటియు అనకాపల్లి మండల మహాసభ వారాది సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరిస్తున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం ఒక వైపు కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ, మరో వైపు సామాన్యులపై భారాలు మోపుతుందని విమర్శించారు. అసంఘటిత రంగం కార్మికులు, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు రూ.26వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తేవాలని డిమాండ్ చేశారు. పరవాడలో ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న సిఐటియు జిల్లా మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మండల కమిటీ ఎన్నిక
ఈ మహాసభలో సిఐటియు మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండల అధ్యక్ష, కార్యదర్శులుగా మళ్ల సత్యనారాయణ, పిఎన్‌వి.పరమేశ్వరరావు, కోశాధికారిగా జె.రమేష్, ఉపాధ్యక్షులుగా వారాది సత్యనారాయణ, గంట శ్రీరామ్, వై.యేసు రాజు, ఎన్.కాసులమ్మ, మజ్జి శంకర్రావు, సహాయ కార్యదర్శులుగా ఎన్ వరలక్ష్మి, ఎం సూర్య కళ, అజరు, కనకాల రమణ, కాపుశెట్టి అప్పారావు, మరో 14 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.










