ప్రజాశక్తి-భవానీపురం: విద్యాధరపురం 44వ డివిజన్ లేబర్ కాలనీలో కార్మిక శాఖకు చెందిన రూ.50 కోట్ల విలువైన రెండెకరాల స్థలాన్ని కబ్జా చేసి దానిలో వైసిపి కార్యాలయం ఏర్పాటు చేయటం తగదని సిపిఎం ఫ్లోర్‌లీడర్ బోయి సత్యబాబు అన్నారు. ఆ స్థలంలో పేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆ స్థలాన్ని సిపిఎం పశ్చిమ సిటీ నాయకులు ఇ.వి.నారాయణ, కె.సూరిబాబులతో కలిసి సత్యబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా బోయి సత్యబాబు మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని కార్మిక శాఖకు చెందిన 30 ఎకరాల విలువైన స్థలం కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. స్టేడియం నిర్మాణం 15 ఏళ్లుగా కలగా మిగిలిపోయిందన్నారు. స్టేడియం స్థలంలో భాగమైన రెండెకరాల స్థలంలో వైసిపి కార్యాలయం నిర్మాణానికి ఎన్‌ఓసి ఇవ్వటం కోసం ఈ నెల 27వతేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో మేయర్ ముందస్తుగా ధ్రువీకరరించారని, దాన్ని కార్పొరేటర్లు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇటీవల ఈ స్థలంలో జరిగిన ఇఫ్తార్ విందులో సిఎం పాల్గొన్నారని, ఈ స్థలాన్ని ప్రజల కోసం వినియోగిస్తారా, సొంత ప్రయోజనాల కోసం వినియోగిస్తారో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రతిపాదన రద్దు చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులను కలుపుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు.










