Nov 21,2023 21:25

కార్మిక, రైతు సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ

ప్రజాశక్తి - పార్వతీపురం : ఈనెల 27, 28 తేదీల్లో తలపెట్టిన కార్మిక, రైతు మహా ధర్నాను జయప్రదం చేయాలని కార్మిక, రైతు సమన్వయ జిల్లా కమిటీలు పిలుపునిచ్చింది. ఈ మేరకు స్థానిక సుందరయ్య భవనంలో మహాధర్నా పుస్తకాన్ని సమన్వయ కమిటీ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం కార్మిక, రైతు సమన్వయ కమిటీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శ కె.సుబ్బారామమ్మ, కార్మిక, రైతు సమన్వయ కమిటీ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాల పిలుపు మేరకు విజయవాడలో ఈనెల 27,28 తేదీల్లో జింఖాన్‌ మైదానంలో జరిగే కార్మిక రైతు మహా ధర్నాకు వందలాదిమంది కదిలి రావాలని అన్నారు. కార్మికులకు, రైతులకు, ప్రజలకు, దేశానికి వ్యతిరేకమైన వినాశకర కార్పొరేట్‌ అనుకూల విధానాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దూకుడుగా అమలు చేస్తుందని, ఇటువంటి ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడమే మార్గమని అన్నారు. కొత్తగా కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు ఈ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి భయపడే స్థాయిలో కార్మిక, రైతు ఐక్య పోరాటాలు పెరగాలని, ఈ దిశలో విజయవాడ మహాధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ధరలను నియంత్రించాలని, ఆహారం, మందులు, వ్యవసాయ ఉపకరణాలపై జిఎస్‌టి రద్దు చేయాలని, పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌పై ఎక్సైజ్‌ పన్నులు తగ్గించాలని, రైల్వే రాయితీలు, పాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా పంపిణీ పథకాన్ని విస్తృతం చేసి ఆహార భద్రత కల్పించాలని, కనీస వేతనం నెలకు రూ.26వేలు నిర్ణయించి అమలు చేయాలని, ప్రతి ఏటా భారత కార్మిక మహాసభ నిర్వహించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేసి లీజు విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను ఆపాలని, కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, విద్యుత్‌ సవరణ చట్టం రద్దు చేయాలని, ప్రాథమిక హక్కుగా పని ప్రభుత్వ కాలనీ భర్తీ చేసిన ఉపాధి కల్పించాలని, ఉపాధి హామీ పనులను రోజుకు రూ.600 వేతనంతో 200 రోజులకు పెంచాలని, పట్టణాలకు విస్తరించాలని డిమాండ్‌ చేశారు. స్కీం వర్కర్లకు, ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం పెన్షన్‌ గ్రాట్యూటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలు చేయాలని రెగ్యులర్‌ చేయాలని, భవన నిర్మాణం, హామాలి ఆటో రవాణా రంగం తదితర అసంఘటిత కార్మికులకు సమగ్ర సామాజిక సంక్షేమం అమలు చేయాలని కోరారు. సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేయాలని తదితర సమస్యల పరిష్కారం కొరకు ఐక్యపోరాటాల్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మిక, రైతు సమన్వయ కమిటీల నాయకులు శ్రీను నాయుడు, గరుగుబిల్లి సూరయ్య, కొల్లి గంగునాయుడు, దావాల రమణారావు, రెడ్డి లక్ష్మునాయుడు, బంటు దాసు, తోట జీవ, పి.సంగం, ఎన్‌.రాజు, బాష, సుబ్బారావు, ప్రసాదు, యమ్మల మన్మధరావు, రెడ్డి ఈశ్వరరావు తదితరుల పాల్గొన్నారు.