కడప అర్బన్ : రైతు, కార్మికుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా నవంబర్ 26, 27, 28వ తేదీలలో విజయవాడ రాజభవన్ వద్ద జరిగే మహాధర్మాలను జయప్రదం కోసం ఈనెల 4న కడప ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించే జిల్లా స్థాయి సదస్సును జయప్రదం చేయాలని వామపక్ష కార్మిక, రైతు సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు బి.మనోహర్, నాగసుబ్బారెడ్డి, కార్యదర్శులు దస్తగిరిరెడ్డి, ఎం.సుబ్బారెడ్డి, వి.అన్వేష్, డబ్ల్యూ రాము, రమణయ్య కోరారు. బుధవారం ఎఐటియుసి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు పంటలకు సమగ్ర ఉత్పత్తివ్యయానికి అదనంగా 50 శాతం కలిపి చట్టబద్ద మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కౌలురైతులతో సహా రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పెంచి పంట రుణాలు అందించాలని కోరారు. కేరళలో మాదిరి రైతు రుణ ఉపసమన చట్టంను పార్లమెంట్‌లో చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమాన్నికి నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని పేర్కొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌తో సహా ప్రభుత్వ రంగాన్ని అమ్మడాన్ని అడ్డుకోవాలని పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రసాదించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు ఆందోళన చేపట్టాలని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, తదితర అంశాలపై విజయవాడలో నవంబర్ 26, 27, 28వ తేదీలలో రాజ్ భవన్ ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దుష్టపరిపాలన చేస్తున్న మోడీ- బిజెపిని, జగన్-వైసిపి ప్రభుత్వాలను గద్దె దించేందుకు ప్రజానీకాన్ని చైతన్య పరుస్తామని పేర్కొన్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపదను అదాని, అంబానీలకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతుందని పేర్కొన్నారు. కృష్ణా జలాల పంపిణీ సక్రమంగా లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఏం మాట్లాడకపోవడం చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రజా కంఠక ఉపా, దేశద్రోహం, మనీ ల్యాండ్ రింగు నిరారోపణలతో ప్రతిపక్ష నాయకులను, సంస్థలను వేధిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక విధానాలను అనుసరిస్తుందని పేర్కొన్నారు. ఒక క్షణం కుడా బిజెపికి పరిపాలన చేసే అర్హత లేదని స్పష్టం చేశారు. ఈ సదస్సులో భవిష్యత్ కార్యాచరణ రూపొందించినందుకు జిల్లా స్థాయిలో సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు వామపక్ష, కార్మిక, సంఘాల రాష్ట్ర నాయకులు హాజరవుతున్నట్లు చెప్పారు. సమావేశంలో కార్మిక సంఘం నాయకులు బాదుల్లా మదిలేటి, రవికుమార్ పాల్గొన్నారు.