ప్రజాశక్తి - యంత్రాంగం
సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లాలో పలుచోట్ల కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. వ్యకాస, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వైభవంగా ఈ పోటీలు నిర్వహించారు. మహిళలు, యువకులు పెద్దఎత్తున ఈ పోటీల్లో పాల్గొన్నారు.
కుక్కునూరు:సంక్రాంతి సందర్భంగా మండవ రామిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి కుమారుడు మండవ శ్యామ్ సుందర్ రెడ్డి సహకారంతో వ్యకాస ఆధ్వర్యంలో ఈ నెల11 నుండి 14వ వరకూ స్థానిక రామసింగారం పాఠశాలలో నిర్వహిస్తున్న ఆటల పోటీలను పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు బుధవారం ప్రారంభించారు. డివిజన్ స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, షటిల్, రేలా డ్యాన్స్ గిరిజన సాంప్రదాయనృత్య పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాల వైపు పోకుండా గ్రామాలో సాంప్రదాయ క్రీడలు, పాటలు, కళారూపాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వ్యకాస ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్న ట్రస్ట్ ఛైర్మన్ మండవ శ్యామ్ సుందర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు వై.నాగేందర్రావు, జెడ్‌పిటిసి సభ్యులు కుంజా నాగేశ్వరరావు, ఎంపిపి చేబ్రోలు గీతావాణి, సర్పంచి రావు మీనా, సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ శ్రీనివాసరావు, వైస్‌ఎపిపి తాండ్ర రాజేష్, జి.రామచంద్రం, వైసిపి నాయకులు కె.నరసింహారాజు, రామిరెడ్డి పాల్గొన్నారు.
ఏలూరు:పండుగ సమయాల్లో యువత చెడు అలవాట్లు దూరంగా ఉంచేందుకు డివైఎఫ్‌ఐ, ప్రజా సంఘాలు ప్రతిఏటా ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఏలూరు వన్‌టౌన్ సిఐ బోణం ఆదిప్రసాద్ ఆన్నారు. గురువారం పవర్‌పేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, బాల సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలను సిఐ ప్రారంభించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ అధ్యక్షతన జరిగిన సభలో సిఐ మాట్లాడారు. సమాజంలో మంచిమార్పు తీసుకొ చ్చేందుకు ప్రజాసంఘాలు నిరంతరం పనిచ ేయడం అభినందనీయమన్నారు. సంక్రాంతిని యువత సాంప్రదాయబద్ధంగా ఆనందంగా జరుపుకోవాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ సంక్రాంతి పండుత ఒక మతానికి, కులానికి చెందినది కాదని, ప్రజలంతా ఐక్యంగా జరుపుకునే పండుగ అని అన్నారు. ఇలాంటి పండుగ సమయంలో కొందరు యువకులు కోడి పందేలు, జూదం వల్ల చెడు వ్యసనాలకు బానిసవుతున్నారని, వాటిపట్ల అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాన్నారు. ఏలూరు వంటి పట్టణాల్లో గంజాయి వంటి మత్తు పదార్థాలు రప్పించి, విద్యార్థులు, యువతీయువకులను పాడు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. మత్తు పదార్థాల బారిన పడకుండా యువతీయువకులు సన్మార్గంలో నడపాలన్నారు. సిఐటియు నగర కార్యదర్శి పి.కిషోర్ మాట్లాడుతూ ఏలూరులో 50 కేంద్రాల్లో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని ఆటల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ ఏలూరు నగర కార్యదర్శి పి.శివశంకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పివి.రామకృష్ణ, ఏలూరు విజరు జ్యూయలర్స్ శ్రీనివాస్, చెస్ ఆర్బిటర్ డి.లక్ష్మణరావు, సహాయకులు లక్ష్మి పాల్గొన్నారు. అనంతరం సిఐ ఆది ప్రసాద్ చెస్ ఆడి ఆటలోని మెళకువల గురించి విద్యార్థులతో ముచ్చటించారు.










