Nov 07,2022 23:48

అరకులోయలో నివాళి అర్పిస్తున్న బాలదేవ్‌, నాయకులు

ప్రజాశక్తి -పాడేరు: ఐక్య పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్యపడాల్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎస్‌.రమేష్‌ ఐదవ వర్ధంతి పురస్కరించుకొని చింతపల్లిలోని ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులతో కలిసి ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ,దేశం, రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోరే ప్రభుత్వాలు లేవని, సమస్యలు పరిష్కారం కావాలంటే బలమైన కార్మిక పోరాటాల ద్వారానే పరిష్కారం అవుతాయని అన్నారు. లక్షలాది మంది కార్మికులు అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పిఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వాల మెడలు వంచే పోరాటాలు చేయాలన్నారు. రమేష్‌ ఏజెన్సీ ప్రాంతంలో కాపీ కార్మికుల పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని సమస్యల పరిష్కారం కావడానికి దోహదపడ్డాడని కొనియాడారు. రమేష్‌ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజులమ్మ, కార్మికులు పాల్గొన్నారు.
అరకులోయ :
కనీస వేతనం అమలుకై కార్మిక హక్కులు, చట్టాల రక్షణకై కార్మికవర్గం ఐక్య పోరాటం చేయడమే కామ్రేడ్‌ రమేష్‌కు ఇచ్చే నిజమైన నివాళని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు పి.బాలదేవ్‌ అన్నారు. సీఐటీయు అరకులోయ మండల కమిటీ ఆధ్వర్యంలో గిరిజన మ్యూజియంలో మ్యూజియం వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు డి.రాజు అధ్యక్షతన సీఐటీయు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.రమేష్‌ 5వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాలదేవ్‌ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో అనేక ఉద్యమాలకు రమేష్‌ ప్రాతినిధ్యం వహించారన్నారు. ఏపీ టూరిజం, విఆర్‌ఏ, గ్రామ పంచాయతీ, గిరిజన మ్యూజియం, పద్మాపురం, కొత్తవలస గార్డెన్‌, కాఫీ కార్మికుల పోరాటంలో అగ్ర భాగాన నిలిచారన్నారు. బాక్సైట్‌ పోరాటంలో మార్గదర్శకంగా నిలిచారన్నారు. రమేష్‌ ఉద్యమ స్పూర్తితో భవిష్యత్‌లో కనీస వేతనం అమలుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఏ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అప్పారావు, మ్యూజియం నాయకులు బురుంధ, లక్మి, రంభ, రామారావు, రాంబాబు, ప్రశాంత్‌, ఆటో సంఘం నాయకులు హరి, షోప్‌ యూనిట్‌ నాయకులు దాసుబాబు, కృష్ణ, లలిత, పద్మ, కమందన్న తదితరులు పాల్గొన్నారు.