ప్రజాశక్తి - మాచర్ల : ఎన్.లక్ష్మయ్య, వెంకట్ రమణ మూడు దశాబ్దాల కార్మిక జీవితంలో కార్మికులు సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశారని కెసిపి సిమెంట్ ఫ్యాక్టరీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ, సిఐటియు నాయకులు కె.బాబూప్రసాద్ అన్నారు. స్థానిక కెసిపి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ రిటైర్ అయిన సిఐటియు నాయకులు, కెసిపి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎన్.లక్ష్మయ్య, సిఐటియు నాయకులు వెంకట్ రమణను సిఐటియు కార్యాలయంలో బుధవారం సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాబూప్రసాద్ మాట్లాడుతూ లక్ష్మయ్య మూడు దశాబ్దాల ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, అన్నిటిని తట్టుకొని తనతో పాటు మిగతా కార్మికుల సమస్యలపై పోరాడారని చెప్పారు. లక్ష్మయ్యను ఎన్నో విధాలుగా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేసినా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పని చేశారని అభినందించారు. నిరుపేద వర్గానికి చెందిన వెంకటరమణ ఎన్నో ఇబ్బందులకు తట్టుకుని కార్మికుల కోసం నిలబడ్డారని, సిఐటియులో పని చేశారని అన్నారు. రిటైరైన వారు తమ సేవలను కార్మిక సంఘాలనికి మరింతగా అందించాలని ఆకాంక్షించారు. లక్ష్మయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి వామపక్ష భావజాలం అలవర్చుకున్న తనకు యాజమాన్యం ఒత్తిళ్లు పెద్ద ఇబ్బంది అనిపించలేదన్నారు. నిజాయితీగా ఉండటం వల్ల నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్ననాని తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం లక్ష్మయ్య, రమణను బబూప్రసాద్, జన విజ్ఞాన వేదిక నాయకులు కె.ఆదినారాయణ సత్కరించారు. వివిధ సంఘాల నాయకులు కె.రమణ, చంద్రకళ, జె.శ్రీను, ఉష పాల్గొన్నారు.










