Apr 29,2021 07:10

భారతదేశ సంపదయిన భూములు, గనులు, భారీ పరిశ్రమలను విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా జరిగే పోరాటమిది. కార్పొరేట్లకు వ్యతిరేకంగా భూస్వాములతో సహా వ్యవసాయ రంగ పోరాటాల్లో పాల్గొనడం దీని ప్రత్యేకత. జాతీయ పోరాటంలా అన్ని శక్తులు ఏకం కావడం చూస్తాం. కార్మిక, కర్షక ఐక్యతతో కార్పొరేట్లను ఓడించే కాలం రాబోతున్నదని విశాఖ సభ తెలియచేస్తోంది.
   విశాఖ ఆర్కే బీచ్‌లో 2021 ఏప్రిల్‌ 18న జరిగిన రైతాంగ, కార్మిక సమర శంఖారావం ఒక చరిత్రాత్మక ఘట్టంగా మారింది. ఈ సభకు హాజరైన అఖిల భారత రైతాంగ నాయకులు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ పరిరక్షణ పోరాట కమిటీ నాయకత్వం రైతాంగం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఒకే వేదికపై రైతాంగం, కార్మిక నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలుపునివ్వడం ఒక చారిత్రాత్మక ఘటన. గత 30 ఏళ్ల నుంచి కేంద్రంలోని గత కాంగ్రెస్‌, నేటి బిజెపి ప్రభుత్వాలు సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలను ఐక్యంగా అమలు చేస్తున్నాయి. కేంద్ర బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మరింత దూకుడుగా ఈ విధానాలను అమలు చేయడాన్ని ఈ సభ తీవ్రంగా నిరసించింది. సమాజంలో సంపదను సృష్టించి నూటికి 80 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న కార్మిక, కర్షక వర్గం ఒకటై పోరాడాలనే స్ఫూర్తి ఈ వేదిక నుంచి ప్రారంభమైంది. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో కార్మిక, కర్షక నల్ల చట్టాలపై దండయాత్ర ప్రారంభించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వాలు మొండిగా దుర్మార్గమైన చట్టాలు అమలు చేయడానికి పూనుకుంటే ఆ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలోకి నెట్టాలని ఈ సభ పిలుపునిచ్చింది. ఈ సభ మార్గదర్శకంతో దేశవ్యాపితంగా ఉద్యమాలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం తలొగ్గక తప్పదు. బిజెపి తమ విధానాలను వెనక్కు తీసుకోవాలి. లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు.
   గత 30 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వ రైతాంగ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా విడివిడిగా పోరాటాలు జరుగుతున్నాయి. కానీ మొట్టమొదటసారి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు ఢిల్లీ చుట్టూ రైతాంగ పోరాటం నిర్వహిస్తున్న ప్రథమ పీఠి నాయకులు విశాఖకు రావడం ఈ ఉద్యమానికే ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అంతేగాకుండా కార్మిక, కర్షక ఐక్యతతో మాత్రమే కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పిగొట్టగలమనే విశ్వాసం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను ఆమోదించడం, విద్యుత్‌ సవరణ చట్టం చేయడం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా నాలుగు లేబర్‌ కోడ్‌లు ఆమోదించడం కేవలం కార్పొరేట్‌ ప్రయోజనాలు కాపాడ్డం కోసమే. కనుక రైతాంగం, కార్మికవర్గం ఏకైక లక్ష్యం కార్పొరేట్లకు వ్యతిరేకంగా యావత్‌ ప్రజానీకాన్ని ఐక్యం చేయడం. భారతదేశ సంపదయిన భూములు, గనులు, భారీ పరిశ్రమలను విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా జరిగే పోరాటమిది. కార్పొరేట్లకు వ్యతిరేకంగా భూస్వాములతో సహా వ్యవసాయ రంగ పోరాటాల్లో పాల్గొనడం దీని ప్రత్యేకత. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికవర్గం ఒక తాటి మీదకు రావాల్సిన తప్పనిసరి పరిస్థితిని ప్రభుత్వ విధానాలు కల్పించాయి. చిన్న యజమానులు, పెట్టుబడిదారులు సంక్షోభంలో చితికిపోతున్నారు. కరోనాను అడ్డం పెట్టుకొని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. సంక్షోభ కాలంలో ఉత్పత్తి తగ్గిపోతున్నా వారి లాభాలు మాత్రం పెరుగుతున్నాయి. ఈ అసమానతలకు వ్యతిరేకంగా...జాతీయ పోరాటంలా అన్ని శక్తులు ఏకం కావడం చూస్తాం. కార్మిక, కర్షక ఐక్యతతో కార్పొరేట్లను ఓడించే కాలం రాబోతున్నదని విశాఖ సభ తెలియచేస్తోంది.
   కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్న రాకేష్‌సింగ్‌ టికాయత్‌ (బికెయు జాతీయ నాయకులు), అశోక్‌ ధావలే (ఎఐకెఎస్‌ జాతీయ నాయకులు), బల్‌కరన్‌ సింగ్‌, (ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ నాయకులు), బి.వెంకట్‌ (ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శి), ధర్మపాల్‌ సింగ్‌ (సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ నాయకులు). ఆంధ్రప్రదేశ్‌ రైతు, వ్యవసాయ కార్మిక, కౌలుదారీ సంఘాల నాయకులు, వడ్డే శోభనాద్రీశ్వరరావు (రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌), దడాల సుబ్బారావు, రావుల వెంకయ్య ఈ సభలో పాల్గొన్నారు. జాతీయ నాయకులు ప్రసంగిస్తూ రైతాంగ నల్ల చట్టాలు, కార్మికులపై రుద్దుతున్న నాలుగు లేబర్‌కోడ్‌ లను, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ, కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలను ఓడించే వరకు ఈ పోరాటం కొనసాగాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విశాఖకు, ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికే గర్వకారణమని, 'విశాఖ ఉక్కు-దేశం హక్కు' అని ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని నాయకులంతా ముక్తకంఠంతో నినదించారు.
   పోరాటాలతోనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పుట్టింది. నేడు పోరాటాలతోనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఇప్పటివరకు ఒక్క శాతం కూడా ప్రయివేటు కాకుండా కాపాడుకున్నాం. కేంద్ర బిజెపి ప్రభుత్వం నూటికి నూరు శాతం ప్రయివేటీకరిస్తామనడాన్ని ఆంధ్రప్రదేశ్‌ యావత్తూ నిరసిస్తున్నది. ఇటీవల దేశవ్యాపితంగా వచ్చిన ఆక్సిజన్‌ కొరతలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి 130 టన్నుల మెడికల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు పంపడంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మరింత మద్దతు లభించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రతిష్ట పెరిగింది. దేశం లోని అదానీ, అంబానీతో సహా ఇతర ప్రయివేటు కంపెనీలు ఎందుకు ఆక్సిజన్‌ను సరఫరా చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోయినా ప్రయివేటు వారికి పట్టదు. పబ్లిక్‌ సెక్టార్‌ వుంటేనే ప్రజల ప్రాణాలకు రక్షణ వుంటుందని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రుజువు చేసింది.
   స్వాతంత్య్రం నాటి నుంచి కార్మికవర్గం పోరాడి అనేక హక్కులు సాధించుకున్నది. 8 గంటల పని దినం కోసం జరిగిన పోరాటాన్ని గుర్తుచేసుకోవడమే మే డే ప్రాధాన్యత. ప్రతి హక్కు వెనుక మహత్తర పోరాటాలున్నాయి. ఇంతకాలం పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వాటి సారాన్ని తీసివేస్తున్నది. నాలుగు లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చాలని ప్రయత్నిస్తున్నది. అందుకే యావత్‌ కార్మికవర్గం బానిస చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
   వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు చట్టాల వల్ల రైతుల పంటలకు ఇప్పుడు కనీస మద్దతు ధర కూడా లేకుండా పోతుంది. మార్కెట్లు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మూసివేస్తారు. వ్యవసాయం మొత్తం కార్పొరేట్‌ కంపెనీల వశమవుతుంది. ప్రజలకు ఆహార భద్రత లేకుండా పోతుంది. దేశంలోని 500 రైతు సంఘాల ఏకమై ఈ చట్టాల రద్దు కోసం పోరాడుతున్నాయి. రైతు ఉద్యమాన్ని అణచడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. అయినా రైతు ఉద్యమం సడల లేదు. మరింత ఊపందుకుంది.
   విశాఖ స్టీల్‌పై నష్టాలనే నెపం వేస్తున్నది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.4,950 కోట్లు మాత్రమే పెట్టుబడిగా పెట్టింది. కాని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఇప్పటి వరకు రూ.44 వేల కోట్లు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు, డివిడెండ్ల రూపంలో చెల్లించింది. రూ.3 లక్షల కోట్ల విలువైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రూ. 1300 కోట్లకు కారుచౌకగా విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టాలని కేంద్ర క్యాబినెట్‌ సబ్‌ కమిటీ తీర్మానించింది. విశాఖ స్టీల్‌ను కార్పొరేట్లకు కట్టబెట్టడం దేశద్రోహం కాదా? దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్ముతామని ప్రధాని ప్రకటించారు. అన్నీ అమ్మడానికి భారీ పరిశ్రమలను హోల్‌సేల్‌ షాప్‌ అనుకుంటున్నారా? దేశాభివృద్ధికి పట్టుగొమ్మలుగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు పని చేస్తున్నాయి. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించాయి. రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల సామాజిక న్యాయం సాధ్యమైంది. వెనుబడిన ప్రాంతాల అభివృద్ధి జరిగాయి. అందుకే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి త్యాగానికైనా సిద్ధం కావాలని యావత్‌ రాష్ట్ర ప్రజానీకానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది.
   కార్మిక, కర్షక, ఐక్యత ద్వారానే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచగలం. విశాఖలో రైతుల, కార్మిక సమర శంఖారావ నినాదం దేశమంతా మారుమోగుతోంది. దేశంలోని యావత్‌ కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాలకు విశాఖ స్టీల్‌ ఉద్యమం కేంద్ర బిందువు కానుంది.
 

/ వ్యాసకర్త విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌
సిహెచ్‌. నర్సింగరావు

సిహెచ్‌. నర్సింగరావు