ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల
సమన్వయ సమితి పిలుపు
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్
సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర ట్రేడ్ యూనియన్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 30న విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగే 'కార్మిక కర్షక రాష్ట్ర సదస్సు'ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శాఖ పిలుపునిచ్చింది. శుక్రవారం గాంధీ భవన్‌లో ఈ మేరకు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత రైతాంగ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం కార్మిక కర్షక రాష్ట్ర సదస్సు పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు అధ్యక్షత వహించారు. రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు ప్రారంభ ఉపన్యాసం చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏగుపాటి అర్జున్‌రావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోర్త రాజశేఖర్, ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు జె.సత్తిబాబు, జిల్లా నాయకులు గుబ్బల ఆదినారాయణ, ఎఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి ఆర్.సతీష్, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్వర్లు, ఎఐసిసిటియు రాష్ట్ర కార్యదర్శి గొడుగు సత్యనారాయణ, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి ఏసు తదితరులు పాల్గొని మాట్లాడారు.
రైతాంగ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. 2020 విద్యుత్ బిల్లును రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్ధతు ధరలు కల్పించాలని తదితర డిమాండ్లతో ఢఙల్లీలో రైతాంగం ఏడాదికిపైగా పోరాడిందన్నారు. 500కు పైగా రైతు సంఘాలతో ఏర్పడ్డ 'సంయుక్త కిసాన్ మోర్చ' నేతత్వంలో ఈ పోరాటం జరిగిందన్నారు. ఆ సమయంలో కేంద్రం దిగొచ్చి సమస్యలను పరిష్కరిస్తామని, డిమాండ్లను నెరవేరుస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందన్నారు. కాని నేటికీ అమలు చేయలేదన్నారు. పైగా పార్లమెంట్‌లో విద్యుత్ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. అంతేకాకుండా స్మార్ట్‌మీటర్లను తీసుకొస్తున్నారన్నారు. లక్షలాది కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఇందులో భాగంగా నిర్వహించే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐఎఫ్‌టియు జిల్లా ఉపాధ్యక్షులు కుంచే అంజిబాబు, ఎపిఆర్‌సిఎస్ రాష్ట్ర నాయకులు కొండ దుర్గారావు, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లచ్చబాబు, ఎపిఆర్‌సిఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మడికి సత్యం, జిల్లా నాయకులు సురేష్ ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి జిల్లా కన్వీనర్ వడ్లమూరి మంగాదేవి, పారిశుధ్య కార్మిక సంఘం నాయకులు బొచ్చ యేసు, వై.సత్తిబాబు, వి.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.










