ప్రజాశక్తి - ఉంగుటూరు
దేశంలోని కార్మిక - కర్షకుల హక్కులను కాలరాయడంలో కేంద్రప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుందని వివిధ ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కల్యాణ మండపంలో సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిఐటియు మండల అధ్యక్షులు సీరా అప్పారావు అధ్యక్షత వహించారు. అనంతరం వచ్చేనెల ఐదో తేదీన జరిగే చలోఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ మాట్లాడుతూ కార్మికవర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను నాలుగు లేబర్ కోడ్‌లుగా కుదించి కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. దేశ ప్రజలందరి ఉమ్మడి ఆస్తులను బడా కార్పొరేట్, పెట్టుబడిదారులకు కారుచౌకగా కట్టబెడుతుందన్నారు. సామాన్యులపై మోయలేని పన్నుల భారం మోపుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నాయన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతుందన్నారు. భారీగా పెరిగిన ధరలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారన్నారు. ప్రతి కార్మికుడికీ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గిట్టుబాటు ధర కల్పించాలని, అధిక ధరలు అరికట్టాలని కోరారు. అనంతరం ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి కొక్కిరపాటి వెంకట్రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోండ్రు చినఅంజయ్య, పసుపులేటి వెంకటేశ్వరావు, భోగా అనంతలక్ష్మి, టేకి శ్రీనివాసరావు, ఆర్.అరుణకుమారి, ఏలూరి పెంటమ్మ పాల్గొన్నారు.










