Apr 28,2023 00:23

మునగపాకలో..

ప్రజాశక్తి- సబ్బవరం:ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు అన్నారు. సీపీఎం, సీపీఐ ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని పిఎసిఎస్‌ వాణిజ్య సముదాయం కూడలిలో గురువారం ప్రచార భేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేట్‌పరం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఇతర విభజన హామీలను గాలికొదిలేసి రాష్ట్రానికి బిజెపి ద్రోహం చేస్తుంటే, రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు ప్రశ్నించకుండా మోడీ ప్రభుత్వానికి భజన చేయడం దారుణమన్నారు. మరో నేత బి.ప్రభావతి మాట్లాడుతూ బిజెపి హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను, గ్యాస్‌, పెట్రోల్‌ ధరలను పెంచి పేదలు, సామాన్యుల నడ్డి విరిచిందని విమర్శించారు. అనంతరం పిఎసిఎస్‌ వాణిజ్య కూడలి నుండి ఎన్టీఆర్‌ జంక్షన్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ, మండల కార్యదర్శి ఉప్పాడ సత్యవతి, నాయకులు కె కోటేశ్వరరావు, పలు కార్మిక సంఘాల నాయకుడు పూడి అప్పల నాయుడు, గొంతిన అప్పారావు(చంటి), బర్ల రమణ, మొల్లేటి గౌరీశ్వరరావు, భవాని, అరుణ, బలిరెడ్డి సోము నాయుడు పాల్గొన్నారు.
సిపిఎం ప్రచార భేరి
అచ్యుతాపురం : మండలంలోని కొండకర్ల, దోసూరు గ్రామాల్లో సిపిఎం నాయకులు ప్రచార భేరి నిర్వహించారు. ఉపాధి హామీ పని ప్రదేశానికి వెళ్లి కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆర్‌.రాము, కె.సోమునాయుడు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని, దానికి బడ్జెట్‌లో నిధులు తగ్గించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయమ్మ, నూకరాజు, భవాని, పార్వతమ్మ పాల్గొన్నారు.
మాకవరపాలెం : మండల కేంద్రం మాకవరపాలెంలో సిపిఎం, సిపిఐ నాయకులు గురువారం ప్రచార భేరి నిర్వహించారు. ప్రధాన రహదారిలోని ప్రతి ఒక్కరికీ కరపత్రాలు పంపిణీ చేసి బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సందర్బంగా సీపీఐ మండల కార్యదర్శి పాలపర్తి తాతబ్బాయి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు డి.సత్తిబాబు మాట్లాడుతూ బిజెపి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిందని, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతు గిట్టుబాటు ధర లేకుండా చేసిందని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28న నర్సీపట్నంలో జరుగు బహిరంగ సభలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు నల్లబల్లి శ్రీరామ్మూర్తి, వంటాకుల భవాని, బంగారు సత్యనారాయణ, గీతా కృష్ణ పాల్గొన్నారు.