Nov 14,2022 23:05

ప్రజాశక్తి - టి.నరసాపురం
              కార్మిక చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, వాటిని పటిష్టంగా అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు మొడియం నాగమణి డిమాండ్‌ చేశారు. సోమవారం సిఐటియు మండల మహాసభ స్తానిక ప్రజా సంఘాల కార్యాలయం వద్ద జై భీమ్‌ భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి వేముల రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగమణి మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కారని, కార్మిక హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. అంగన్‌వాడీ, ఆశా, స్కీం బేస్డ్‌ కార్మికులకు రూ.26 వేల వేతనం అమలు చేయాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పటిష్టంగా అమలు చేయాలని, ఆటో ట్రాలీ డ్రైవర్‌ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈనెల 18, 19 తేదీల్లో ఏలూరులో జరిగే సిఐటియు జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం సిఐటియు మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. సిఐటియు మండల అధ్యక్షులుగా ఎం.విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా కెవివి.సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన, పాఠశాల, భవనిర్మాణ కార్మికులు, ఆటో, ట్రాలీ యూనియన్‌ నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తుమ్మల సత్యనారాయణ పాల్గొన్నారు.