Jul 09,2023 23:55

ప్రజాశక్తి - కారెంపూడి : పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మనందిరపైనా ఉందని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అన్నారు. ప్రకృతి ప్రియుడు కొమెర అంకారావు (జాజి) ఏర్పాటు చేసిన కోటి విత్తనాలు నాటే కార్యక్రమాన్ని మండల కేంద్రమైన కారెంపూడిలోని మంత్రాలయం గుడి వద్ద గల నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ మొక్కలపై కొమెర అంకారావు అధ్యయనం చేసి వాటి గురించి విద్యార్థులకు వివరించడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఒకేసారి కోటి విత్తనాలు నాటడం అనే కార్యక్రమం ఎంతో కష్టమైందే అయినా కొమెర అంకారావు కృషితో అది సాధ్యమైందని చెప్పారు. అడవిలో ఉండే ప్రతిఒక్క మొక్కా ఔషధ గుణాలు కలిగి ఉంటుందని అన్నారు. మనకు తెలియని విషయాలు కూడా అంకారావు తెలుసుకొని భావితరాలకు మొక్కల గురించి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం పర్యావరణం - మొక్కల పెంపకంపై కస్తూర్బా పాఠశాల విద్యార్థినులతో కలెక్టర్‌ కొద్దిసేపు మాట్లాడారు. కొమెర అంకారావుతో కలిసి నల్లమల అడవి ప్రాంతంలో విత్తనాలను చల్లారు. అవసరమైన ఆహార విత్తనాలను కూడా చల్లారు. అంకారావును కలెక్టర్‌ శివశంకర్‌ సత్కరించి ఆయన ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి రూ.50 నగదును అందించారు. తొలుత పిహెచ్‌సిలో అదనపు బ్లాక్‌ యూనిట్‌ నిర్మాణానికి స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించి స్థల కేటాయింపుపై తహశీల్దార్‌ శ్రీనివాస్‌ యాదవ్‌తో మాట్లాడారు. కార్యక్రమాల్లో జెడ్‌పిటిసి షపీ, ఎంపిడిఒ శ్రీనివాసరెడ్డి, పిహెచ్‌సి వైద్యాధికారి దుర్గరావు, పంచాయతీ విస్తరణ అధికారి సత్యప్రసాద్‌, సిఐ డి.జయకుమార్‌, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.