Aug 30,2023 22:42

పొందూరులో నిరసన వ్యక్తం చేస్తున్న దస్తావేజు లేఖర్లు

* జిల్లాలో పలుచోట్ల దస్తావేజు లేఖర్లు పెన్‌డౌన్‌తో నిరసన
* ఆచరణలోకి వస్తే జీవనోపాధికి ఇబ్బందులే
* నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్‌
ప్రభుత్వం తీసుకున్న కార్డ్‌ప్రైమ్‌ 2.0 విధానంపై దస్తావేజు లేఖర్లు కన్నెర్ర చేశారు. ఈ విధానం అమల్లోకి వస్తే వేలాది మంది బతుకులు వీధిన పడతాయని భయాందోళనలు వ్యక్తం చేశారు. మా వేదనను సర్కారు దృష్టికి తీసుకువెళ్లాలని రిజస్ట్రార్లకు, సబ్‌ రిజస్ట్రార్లకు వినతిపత్రాలు అందజేశారు. తమ వినతిని పెడచెవిన పెడితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పొందూరు : ప్రభుత్వం తీసుకువస్తున్న కార్డ్‌ప్రైమ్‌ 2.0 విధానాన్ని నిరసిస్తూ పొందూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట బుధవారం దస్తావేజు లేఖర్లు నిరసన తెలుపుతూ పెన్‌డౌన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. దస్తావేజు లేఖర్లు సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పైడి రాంప్రసాద్‌, బలివాడ సత్యనారాయణలు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ విధానంతో రాష్ట్రంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లేఖర్లు, డీటీపీ ఆపరేటర్లు, తమ జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడతారని అన్నారు. రెండు రోజులుపాటు ఈ పెన్‌డౌన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకువస్తున్న కార్డ్‌ప్రైమ్‌ 2.0 విధానం వలన తలెత్తే సమస్యలను, ఇబ్బందులను రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, కె.ప్రసాదరావు, వి.ఎస్‌.పట్నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.
పలాస: కాశీబుగ్గ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎదుట కూడా నిరసన తెలిపారు. అనంతరం కాశీబుగ్గ సబ్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌. తవిటయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ దస్తావేజు లేఖర్లు సంఘం అధ్యక్షులు రవి కుమార్‌, పట్నాయక్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు నర్తు ధనుంజయరావు, జయరాం, ఎల్‌. గోవిందరావు, శిస్టు. శ్రీనివాస్‌, శ్యామ్‌ పట్నాయక్‌, వెంకటేష్‌, బివిఎన్‌ రావు, లండ సురేష్‌ దస్తావేజు లేఖరులు, స్టాంప్‌ వెండర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ పాల్గొన్నారు.
టెక్కలి రూరల్‌: ఆ విధానం ఆచరణలోకి వస్తే అమ్మకందారులకు మనుగడ లేదని సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం సబ్‌ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి రామారావు, శాసనపురి లవ కుమార్‌, అంప్లాం శివప్రసాద్‌, బుడంకాయల అభిలాష్‌, దోగాన నీలాచలం, శాసనపురి వెంకటరమణ, దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు.
ఆముదాలవలస : పట్టణంలోని డాక్యుమెంటరీ రైటర్‌ సంఘం నాయకులు సభ్యులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఇటువంటి లోపభూయిష్టమైన ప్రైమ్‌ 2 విధానాన్ని నిలిపివేయాలని తెలిపారు. అనంతరం సబ్‌ రిజిస్టర్‌ బి. అరుణకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్‌ రైటర్స్‌ కె.పెద్దిరాజు, ఆర్‌. నాగరాజు, బి. శ్రీనివాసరావు, పి. నాగరాజు, ఎం. సురేష్‌, చింతాడ లక్ష్మణరావు, సువ్వారి రాజు,పి. ప్రభాకర రావు, ఎం. వేణు,పి. రవి, జి.ఢిల్లేశ్వరరావు, బి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అర్బన్‌ : కార్డు ప్రైమ్‌ 2.0 విధానం ప్రవేశపెట్టే యోచన ప్రభుత్వం చేస్తుందని, దీనివల్ల అన్ని విధానాలా అనర్ధమేనని జిల్లా డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా రిజిస్ట్రార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.