Apr 13,2023 23:11

సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్‌ రమేష్‌బాబు

ప్రజాశక్తి-గుంటూరు : కార్డియాక్‌ అరెస్ట్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రమేష్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పీ.రమేష్‌బాబు అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో డీన్‌ ప్రమోషన్స్‌, కొలాబరేషన్స్‌, ఫ్యాకల్టీ అఫైర్స్‌ ఆఫీస్‌ ఆధ్వర్యంలో 'హార్ట్‌ డిసీజెస్‌ - ఆరిజన్‌ అండ్‌ ప్రివెన్షన్‌' అంశంపై అధ్యాపకులు, సిబ్బందికి గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ రమేష్‌బాబు మాట్లాడుతూ ఆధునిక జీవితంలో మద్యం, ధూమపానం, ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం, వంశ పారంపర్యం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, ఒత్తిడి వంటి కారణాలతో ఎక్కువ మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారని వివరించారు. మొదట్లోనే వీటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాబోయే ముప్పును నివారించొచ్చని చెప్పారు. కార్డియాక్‌ అరెస్టు సంభవించినప్పుడు మెదడుకు రక్త ప్రసరణ ఎంతో ముఖ్యమని, గోల్డెన్‌ సమయంలో చికిత్సను అందించడం ద్వారా వ్యక్తి ప్రాణాల్ని ఏ విధంగా కాపాడవచ్చని వివరించారు. ముందుగా గుర్తిస్తే 98 శాతం కార్డియాక్‌ అరెస్ట్‌లను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ బాడీ మాస్‌ ఇండెక్స్‌ లెవల్స్‌ను సరైన పద్ధతిలో ఉంచుకోవాలని సూచించారు. 5జీ అంబులెన్స్‌, టెలీమెడిసిన్‌ వంటివి త్వరగా అందుబాటులోకి రావాలన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వీసీ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.