ప్రజాశక్తి-పాడేరు టౌన్: కాఫీ తోటల ఏకీకరణపై సమగ్రమైన సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ ఆదేశించారు. కాఫీ రైతులకు ఎకరాకు 900 కాఫీ మొక్కలను గతంలో పంపిణీ చేసి నాటించామన్నారు. ఎకరా భూమిలో 650 మొక్కలకు తక్కువ ఉన్న తోటల్లో సర్వే చేసి నివేధికలు సమర్పించాలన్నారు. కాఫీ తోటలు పునరుద్ధరణకు చర్యలు చేపడతామన్నారు. బుధవారం ఐటిడిఎ సమావేశ మందిరంలో 11 మండలాల ఉద్యానవన అధికారులు, కాఫీ కన్సల్టెంట్లు, లైజాన్ వర్కర్లు, కాఫీ బోర్డు అధికారులతో కాఫీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాఫీ రైతుల ఆదాయం పెరిగే విధంగా కాఫీ తోటలు పునరుద్ధరణ జరగాలన్నారు. లైజాన్ పర్కర్ల పరిధిలో 75 నుండి 100 ఎకరాలలో, రైతుల సమక్షంలో కాఫీ తోటల్లో పర్యటించి సర్వే చేసి, నమూనా పత్రాలను లైజాన్ వర్కర్లకు అందజేసారు. సర్వే ఏ విధంగా చేయాలో వివరించారు. 70 వేల మందికి అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేసామన్నారు. ప్రభుత్వం రైతు భరోసా అందిస్తోందని ఆయా డబ్బును కాఫీ తోటల అభివృద్ధికి పెట్టుబడిగా ఉపయోగించుకునేందుకు రైతులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేసారు. ప్రభుత్వం రూ.13500లు రైతు భరోసాగా అందిస్తోం దని దీనిని వ్యవసాయం, ఉద్యాన వన పెట్టుబడులకు వినియోగించుకోవాలని సూచించారు. ఈనెల 20న ఆర్ వి నగర్ కాఫీ సాగుపై శిక్షణకు ఉద్యాన వన అధికారులు విధిగా హాజరు కావాలన్నారు.
ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 52 నర్సరీలలో కాఫీ మొక్కలు సాగవుతున్నామన్నారు. ఈ ఏడాది మరో 16 వేల ఎకరాలలో కాఫీ తోటల విస్తరణకు చర్యలు చేపట్టామన్నారు. పాత కాఫీ తోటలో పొదల తొలగింపు, ప్రూనింగ్ పనులు చేసేలా కాఫీ రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఐటిడిఎ ఎపిఒ (పిటిజి) ఎం.వేంకటేశ్వరరావు, కాఫీ బోర్డు డిడి జయంతి ఘోష్, జిల్లా ఉద్యానవన అధికారి రమేష్ కుమార్‌రావు, ఐటిడిఎ పిహెచ్‌ఒ ఎన్.అశోక్, ఎస్‌ఎల్‌ఒ విష్ణు, ఉద్యాన వన అధికారులు, లైజాన్ వర్కర్లు పాల్గొన్నారు.










