Oct 13,2023 00:02

మాట్లాడుతున్న చిన్నబాబు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:కాఫీ రైతులకు గిట్టు బాటు ధర కల్పించాలని కాఫీ రైతుల సంఘం జాతీయ అధ్యక్షులు జి.చిన్నబాబు డిమాండ్‌ చేశారు. గురువారం ఆదివాసీ గిరిజన భవనంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ 11 మండలల్లో కాఫీ పళ్ళు కోత ముమ్మరంగా మొదలైందని, ప్రభుత్వమే జీసిసి సంస్థ ద్వారా కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గత సంవత్సరం కాఫీ పళ్ళ సీజన్‌ రాకుండా ముందే ఆగస్టు నెలలోనే ధర ప్రకటించిన ఐటిడిఏ అధికారులు ఈ ఏడాది పళ్ళ కోత సీజన్‌ ప్రారంభం అయినా కూడా ధర ప్రకటించక దారుణమన్నారు. దీంతో, రైతులకు ధరలు తెలియక, ప్రభుత్వం కోనుగోలు చేయక పోవడంతో దళారుల చేతుల్లో మోస పోతున్నారనిన్నారు. తక్షణమే దళారు వ్యవస్థను అరికట్టాలన్నారు. గతంలో కిలో పార్చిమెంట్‌ కాఫీ రూ.270, చెర్రీ రూ.135లకు కొనుగోలు చేసారని ఈ సంవత్సరం కనీసం కిలో కాఫీ పళ్ళు పచ్చివి రూ.100లకు, పార్చిమెంట్‌ రూ.500లకు, చెర్రీ కాఫీ రూ.270లకు కొనుగోలు చేయాలన్నారు. ప్రయివేట్‌ సంస్థలైన నాంది కూడా కిలో పళ్ళ కాఫీ రూ.100లకు తగ్గకుండా కొనుగోలు చేయాలన్నారు. అరకు ఆర్గానిక్‌ కాఫీకి దేశ విదేశాల్లో సైతం మంచి పేరు, ధర ఉందని పండించే రైతుకు మాత్రం కనీస గిట్టు బాటు ధర కల్పించలేదని అన్నారు. రైతులకు బకాయి పడ్డ 60కోట్ల డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఏడాది కాఫీ పంట వేసుకున్న రైతులకు చెల్లించాల్సిన డబ్బులు తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. జిసిసి సంస్థ రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.50,000 ఇవ్వాలని, ప్రతి రైతుకు పల్పింగ్‌ మిషన్‌, ఇండివిడ్యుయల్‌, అల్యూమినియం, నిచ్చెనలు, ఆర్గానిక్‌ సర్టిఫికెట్‌ ప్రతి రైతుకు ఇవ్వాలన్నారు. రైతులకు నేరుగా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించక పోతే కాఫీ రైతులతో ఐటిడిఏ వద్ద ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాఫీ రైతుల మండల కార్యదర్శి గురుమూర్తి, ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షులు జి.బుజ్జి బాబు, నానిబాబు పాల్గొన్నారు.