Jan 21,2023 23:47

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న అప్పలనర్స, నాయకులు

ప్రజాశక్తి-పాడేరు: గిరిజన ప్రాంతంలో కాఫీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజన సంఘం ప్రతినిధి బృందం శనివారం జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ కు వినతి పత్రం సమర్పించారు.గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అలప్పులనర్స, జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు, లక్ష్మిపురం సర్పంచ్‌ కొర్రా త్రినాధ్‌, గిరిజన సంఘం పాడేరు మండల నాయకుడు భాస్కరరావుతో కూడిన ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అలప్పులనర్స మాట్లాడుతూ, పాడేరు ఏజెన్సీలో సుమారు 2లక్షల ఎకరాల్లో గిరిజన రైతులు కాఫీ సాగుచేస్తున్నారని,. సుమారు 50వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ ఉత్పత్తి కావడానికి అవకాశం ఉందన్నారు. దళారులు గిరిజన ప్రాంతాల్లో తక్కువ ధరకే కాఫీ కొనుగోలు చేస్తున్నారని, మాక్స్‌ సొసైటీ కిలో కాఫీ పండు రూ.36, జిసిసి, మాతోట, నాంది పౌండేషన్‌ రూ.50లకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో అల్లూరి ఏజెన్సీ ఆర్గానిక్‌ కాఫీకి మంచి డిమాండ్‌ ఉన్నా అందుకు అనుగుణంగా కాఫీ రైతులకు న్యాయం జరగ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ నేరేడుబందలో పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరారు.గడుతూరు పంచాయతీ బొడ్డుమామిడి గ్రామంలో సుమారు 175 మంది కొండదొర గిరిజన తెగలు జీవిస్తున్నారని, వారిలో 60 మంది పెద్దలకు, 53 మంది చిన్నారులకు ఆధార్‌ కార్డులు లేక పోవడంతో పాఠశాలలో అడ్మిషన్లకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. బొడ్డుమామిడి గ్రామంలో అన్ని రకాల ఇంటర్నెట్‌ నెట్వర్క్‌ పని చేస్తున్నందున ఆధార్‌ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అర్హులైన 120 మందికి ఓటు హక్కు కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని, కాఫీకి ధరపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారన్నారు. కాఫీ, మిరియాలు, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కోసం ట్రెడర్స్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారన్నారు.ఆధార్‌ కార్డు, ఓటు హక్కు ప్రతి ఒక్కరికి కల్పిస్తామని పేర్కొన్నారని తెలిపారు. నేరేడుబందలో విద్యా బోధనకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్‌ హామీ ఇచ్చారని అప్పలనర్స తెలిపారు.