ప్రజాశక్తి-అనంతగిరి:గిరిజన రైతులు పండించిన కాఫీ పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని ఆల్ ఇండియా కాపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్న బాబు డిమాండ్ చేశారు. పైనంపాడు పంచాయతీ పైనంపాడు గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన కాఫీ రైతుల సదస్సులో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కాఫీ రైతులకు రూ.60. కోట్లు బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజనులు పండించే కాపీ, మిరియాలను ఐటిడిఏ కొనుగోలు చేయాలన్నారు. కాఫీ రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కాపీ పండు కిలో రూ.100, చెరి కాపీ రూ. 270 నుండి 300, మంచి మిరియాలు కిలో రూ.1000లకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
గిరిజన సంఘం మండల అధ్యక్షులు సివేరి. కొండలరావు మాట్లాడుతూ, ప్రతి కాపీ రైతులకు బేబీ పల్పర్, నిచ్చెనలు అందించాలనారు. తోటలు కాలిపోయినపుడు నష్టపోయిన పరిహారం ఇవ్వాల న్నారు. నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయక పోవడంతో దళారులను ఆశ్రయిం చాల్సి వస్తుందన్నారు.
కాపీ రైతు సంఘం పంచాయతీ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. పంచాయతీ కాపీ సంఘం కార్యదర్శిగా పి మలేష్. అధ్యక్షులుగా పి.సుందర్, కమిటీ సభ్యులుగా గెనుబాబు, మల్లన్న, పోతురాజు, అప్పారావు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సదస్సులో సుమారు 300 మంది పాల్గొన్నారు.










