Oct 19,2022 22:46

సదస్సులో మాట్లాడుతున్న సురేంద్ర

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:అల్లూరి సీతా రామరాజు జిల్లా ఏజెన్సీలో 11 మండలాల్లో కాఫీ పంటను ఐటిడిఏ, జీసిసి కొనుగోలు చేసి రైతులకు గిట్టబాటు ధర కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్‌ చేశారు. బుధవారం అరకువేలి శ్రీ వేంకటేశ్వర కళ్యాణ మండపంలో కాఫీ రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ జీ,చిన్నబాబు అధ్యక్షతన కాఫీ రైతులతో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు పండించిన కాపీ, మిరియాల పంటలకు ఐటిడిఎ పిఓ గిట్టుబాటు ధర కల్పించి కిలో కాఫీ పండ్లకు రూ.100 ప్రకటించాలన్నారు. ఇటీవల ఐటిడిఎ పిఓ కిలో పండు కాఫీకి రూ. 36 ప్రకటించడం అన్యాయమన్నారు. దేశ విదేశాల్లో ప్రపంచ స్థాయిలో అరకు అర్గనిక్‌ కాఫీ పంటకు మంచి గిరాకీ ఉన్నా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైపల్యం చెందారని పేర్కోన్నారు. ప్రైవేటు బడా కంపెనీలు అడ్డగోలుగా గిరిజన కాఫీ రైతులకు దోసుకుంటున్నారని, ఈ దోపిడీని అరికట్టాలంటే ఐటిడిఏ, జీసీసి అధ్వర్యంలో కొనుగోలు చేసి గిట్టుబాటుధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పార్శిమెంట్‌ కిలో కాఫీ రూ.500, చెర్రీ కాఫీకి రూ.250, మిరియాలు కిలో రూ.1000ల గిట్టు బాటు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఏజేన్సీ 11 మండల పరిధిలోని బకాయి ఉన్న రూ.30 కోట్ల కాపీ రైతుల ప్రోత్సాహక నిధులు జమ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజ సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు, కాఫీ రైతుల సంఘం మండల నాయకులు సిహెచ్‌ గురుమూర్తి, గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న, అరకువేలి, డుంబ్రిగుడ మండలాల కాఫీ రైతులు, తదితరులు పాల్గొన్నారు.