Jan 27,2023 23:41

ఆందోళన చేపడుతున్న కాఫీ రైతులు నాయకులు

ప్రజాశక్తి-పాడేరు: కాఫీ పళ్ళకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ కాపీ రైతుల సంఘం జాతీయ నాయకులు పాలికి లక్కు డిమాండ్‌ చేశారు. వనుగుపల్లి పంచాయతీ జాముగూడ, చిడీకూడ గ్రామస్తులతో ఆంధ్రప్రదేశ్‌ కాఫీ రైతు సంఘం మండల నాయకులు మత్స్యరాజు అధ్యక్షతన సుమారు 60 మంది గిరిజన కాపీ రైతులతో శుక్రవారం జామిగూడ గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాఫీ రైతు సంఘం జాతీయ నాయకులు పాలికి లక్కు మాట్లాడుతూ, ఐటీడీఏ చెల్లించాల్సిన రూ.60కోట్లు బకాయిల కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు కాపీ రైతులు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందుకు 11 మండలాల కాఫీ రైతులతో చలో ఐటిడిఏ నిర్వహిస్తామని, ప్రోత్సాహక నిధులు బకాయిలు వెంటనే చెల్లించే వరకు పోరాటం సాగిస్తామన్నారు.ఢిల్లీలో చెరుకు రైతులు మద్దతు ధర కోసం ధర్నా నిర్వహిస్తున్నారని, మద్దతుగా కాఫీ రైతులుి తరలి రావాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారన్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కాఫీ, పసుపు, మిరియాలు, కందులు పండించే రైతులకు మద్దతు ధరలు ప్రభుత్వాలు ఇవ్వ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసా రూ.13000 రైతులకు ఏమాత్ర చాలలేదన్నారు. చెరుకు గిట్టుబాటు ధర కల్పించాలని వేలాది మంది రైతులు ఢిల్లీలోధర్నా నిర్వహిస్తున్నారని, వారి పోరాటానికి మద్దతు తెలియజేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనుగుపల్లి పంచాయతీ కాఫీ సంఘం నాయకులు మత్స్యరాజు అధ్యక్షతన, భాస్కర్‌ రావు,సుబ్బారావు చిట్టిబాబు కొంతమంది మహిళలు .ఈ కార్యక్రమంలో జామిగూడ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
బకాయిల చెల్లించాలి: చిన్నయ్యపడాల్‌
పాడేరు: కాఫీ రైతులకు రూ.60 కోట్ల బకాయిలు చెల్లించాలని గిరిజన సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోనంగి చిన్నయ్య పడాల్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం జీకే వీధి మండల కేంద్రంలో కోర్ర బాలయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ, ఎకరానికి నాలుగు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం, ఐటిడిఏ ప్రోత్సాహక నిధి చెల్లిస్తుందని, 2018 నుండి2021 వరకు 47 వేల మంది రైతులకు రూ.60 కోట్లను ఇంతవరకు ఎందుకు చెల్లించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ నగదు ఇచ్చేంత వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు చంటిబాబు, అంపురంగి బుజ్జిబాబు, గడుతూరి సత్యనారాయణ, రామారావు, పది పంచాయతీల కాఫీ రైతులు పాల్గొన్నారు.
కాఫీ రైతుల సమస్యలపై ఆందోళన
అనంతగిరి:కాఫీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, బకాయి సొమ్ము వెంటనే చెలించాని కాఫీ రైతుల సంఘం జాతీయ ఉపాద్యక్షుడు, అరుకు మండలం సుంకర మెట పంచాయతీ సీపీఎం సర్పంచ్‌ గెమ్మెల చిన్నబాబు డిమాండ్‌ చేశారు. వేంగడ పంచాయతీలో కాపీ రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నబాబు, గిరిజన సంఘం మండల అధ్యక్షులు, వేంగడ మాజీ సర్పంచ్‌ కొండలరావు మాట్లాడుతూ, రూ 60.కోట్ల కాఫీ బకాయి సొమ్ము తక్షణమే చెలించాలని డిమాండ్‌ చేశారు. బేబీ పాల్పర్‌ మిషన్లు ఉచితంగా ఇవ్వాలన్నారు. కాలిపోయిన కాపీ తోట లకు నష్ట పరిహారం చెలించాని, కాపీ ప్రోత్సాహక నిధులు ఒక ఎకరానికి రూ.50 వేలు పెంచాలన్నారు. పంచాయతీ కేంద్రలలో కాపీ నిల్వలకు కోల్డ్‌ స్టోరేజ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలను అధికారులు పరిష్కారం చేయకుంటే కాపీ రైతులతో ఫిబ్రవరిలో ఐటిడిఏ ముట్టడిస్తామన్నారు. ఈ సమావేశంలో కాపీ రైతులు డొంబుదొర, మాజీ వైస్‌ సర్పంచ్‌ గోవింద్‌, కేశవ్‌, మోహన్‌, గురుమూర్తి, కాపీ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.