Jan 23,2023 23:43

మాట్లాడతున్న చినబాబు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:ఇంటర్నేషనల్‌ మార్కెట్లో అధిక ధర ఉన్నా కాఫీ రైతులకు గిట్టుబాటు ధర చెల్లించ లేదని కాపీ రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గెమ్మెలి చినబాబు డిమాండ్‌ చేశారు. సోమవారం అరకువేలి గిరిజన సంఘం కార్యాలయంలో కాఫీ రైతుల వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కాపీ రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గెమ్మెలి చిన్నబాబు మాట్లాడుతూ, పార్శిమెంట్‌ కిలో కాఫీ రూ.500, చెర్రీ కాఫీకి రూ.250, కాపీ పచ్చి పళ్ళురూ.100, మిరియాలు కిలో రూ.1000ల గిట్టుబాటు ధర ప్రకటించాలన్నారు. ఐటీడీఏ అధికారులు రైతుల సంక్షేమం కోసం కనీసం స్పందించ లేదన్నారు. కాపీ కేజీ రూ.270 విక్రయాలు చేయాలని జిసిసి ప్రకటించినప్పటికి ఈ విధంగా కొనుగోలు చేయలేదన్నారు. అన్ని పంచాయతీల డిపో పరిధిలో కాపీ కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. బకాయి ఉన్న రూ.60 కోట్ల కాపీ రైతుల అభివృద్ధి ప్రోత్సాహక నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. మూడు, నాలుగు సంవత్సరాలు దాటినా నేటికీ జమ చేయకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతి కాపీ రైతుకి బేబీ పార్శిమెంట్‌ మిషన్‌, నిచ్చెనలు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. ఆర్గానిక్‌ కాపీ తోటలకు పట్టాలు, నష్టం వాటిల్లినప్పుడు ఇన్సూరెన్స్‌, తోటలో ప్రమాదం జరిగితే నష్టపరిహారం, బ్యాంకు రుణాలు తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు. దళారీ వ్యవస్థను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో కప్పు కాపీ రూ.600 ఉండగా పండిస్తున్న రైతులకు మాత్రం గిట్టు బాటు ధర లేకపోవడం బాధాకరమన్నారు.అల్లూరి జిల్లాలో ప్రతి మండలానికి కాపీ ప్రాసెస్‌ యూనిట్లు మంజూరు చేసి గిరిజన యువతకు ఉపాధి కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాపీ రైతుల సంఘం నాయకులు సిహెచ్‌ గురుమూర్తి, పాంగి నానిబాబు, సిహెచ్‌ ప్రసాద్‌, పి.రామన్న, బి.కోగేశ్వరరావు, జి.బుజ్జిబాబు, కె.ఆనంద్‌ కుమార్‌, కాపీ రైతులు పాల్గొన్నారు.