Nov 21,2022 23:45

కాఫీ రైతులకు ధర్నా కరపత్రాలు ఇస్తున్న సంఘం నేతలు

బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యంపై రైతుల గగ్గోలు
ఐటిడిఎ నిర్వాకంపై రైతుసంఘం నేతల మండిపాటు
నేడు ఐటిడిఎ వద్ద ధర్నాకు సన్నాహాలు
ప్రజాశక్తి పాడేరు:
అల్లూరి ఏజెన్సీలోని గిరిజన కాఫీ రైతులు కాపీ బకాయిలు, ఐటిడిఎ, కాఫీ బోర్డ్‌ ప్రోత్సాహక సొమ్ము కోసం నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఏజెన్సీలో దాదాపు 12వేల ఎకరాల్లో కాఫీ తోటల సాగుకు ఐటిడిఎ గిరిజన రైతులను ప్రోత్సహిస్తోంది. ఐదేళ్లు కాఫీ సాగుకు అవసరమైన సమస్తం ఐటిడిఎ, కాఫీ బోర్డ్‌ ఆర్థిక సహకారం అందిస్తోంది. అయితే 2018 నుంచి రైతులకు ప్రోత్సాహక సొమ్ము చెల్లించడం లేదని కాఫీ రైతులు వాపోతున్నారు.ఇన్నాళ్లు ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తుందని ఆశగా ఎదురుచూసిన గిరిజన రైతులు, ఎప్పటికీ ప్రభుత్వం ఐటిడిఎ నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో ఈనెల 22న మంగళవారం ఐటిడిఎ వద్ద ధర్నాకు సిద్ధమౌతున్నారు.
పాడేరు ఏజెన్సీలో 2018 నుంచి మొదలుకొని గడచిన నాలుగు ఏళ్లలో సుమారు 43 వేల మంది గిరిజన రైతులు 47 వేల ఎకరాల్లో కాఫీ సాగు చేపట్టారు. కాఫీ తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆర్థికప్రోత్సాహకం కింద దాదాపు రూ60కోట్లు చెల్లించాల్సి ఉందని గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులకు కాఫీ బోర్డు అందించాల్సిన ఆర్థిక సాయం రూ.30 కోట్లు ఇప్పటికే ఐటిడిఎకు అందించిందని, అయితే ఐటిడిఎ నుంచి కాఫీ రైతులకు ఈ ప్రోత్సాహక సొమ్ము ఇవ్వడం లేదని గిరిజన కాపీ రైతుల సంఘం నాయకులు, ఎపి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు, గౌరవ అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్‌, చింతపల్లి మండల కార్యదర్శి సాగిన చిరంజీవితోపాట కాఫీ రైతు సంఘం నాయకులు చెబుతున్నారు ఒక పక్క కాఫీ గింజలకు గిట్టుబాటు ధర లభించక, దళారుల దోపిడికి గురై నష్టపోతున్నారని గిరిజన కాఫీ రైతులు గగ్గోలు పెడుతుంటే, మరోవైపు కాఫీ ప్రోత్సాహక నిధులను చెల్లించకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అంటున్నారు.
కాగా కాఫీ బోర్డు ఇచ్చిన సొమ్ములతో రైతులకు ఇన్‌పుట్స్‌, బేబీపల్సర్లు, నిచ్చెనలు వంటివి ఇస్తున్నామని ఐటిడిఎ అధికారులు అంటుండగా, దీనిని కాఫీ రైతు సంఘం నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రోత్సాహక సొమ్ము చెల్లించాలని రైతులు కోరుతుంటే, ఈ అడ్డుగోలు చర్యలెందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాఫీ గింజలకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేని స్థితిలో ఐటిడిఎ అధికారులు ఉన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మ్యాక్స్‌ సొసైటీ ద్వారా కాఫీ పళ్ళు కొనుగోలు కిలో రూ.36 చొప్పున ఐటిడిఎ కొనుగోలు చేపట్టిందని,ఈ ధరకు తోటల్లో పళ్లు ఏరివేత కూలీ కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ విజ్ఞప్తి మేరకు కిలో కాఫీ పళ్లు రూ.60 కొనుగోలుకు జిల్లా కలెక్టర్‌ సుముఖత వ్యక్తం చేశారని దీనికి సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చారన్నారు. ఇప్పటికైనా ఐటిడిఎ పిఒ స్పందించి, రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహక నిధులు అందజేయాలని కాఫీ రైతు సంఘం నాయకులు కోరారు.