కాఫీ ప్రోత్సాహక బకాయిలు చెల్లించాలని ఐటిడిఏ వద్ద ర్యాలీ, ధర్నా
ప్రజాశక్తి-పాడేరు : ఏజెన్సీలో కాఫీ రైతుల ప్రోత్సాహక బకాయిలను ఐటిడిఏ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాఫీ రైతుల సంఘం, ఏపీ గిరిజన సంఘం సంయుక్తంగా పాడేరు ఐటిడిఏ వద్ద గురువారం ర్యాలీ, ధర్నా చేపట్టింది. కాపీ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు విలేకరులతో మాట్లాడుతూ, కాఫీ సాగు, అమ్మకాల్లోనూ కాఫీ రైతులు దగా పడుతున్నారని, దీంతో ఆందోళన బాట పట్టాల్సి వస్తోందని చెప్పారు. అధికారులు స్పందించి కాఫీ రైతులకు చెల్లించవలసిన ప్రోత్సాహక బకాయిలపై స్పష్టంగా తెలపాలని డిమాండ్ చేశారు. బకాయిల కోసం ఈనెల 17న శుక్రవారం చేపడుతున్న ధర్నాకు ఏజెన్సీ 11 మండలాల నుంచి కాఫీ రైతులు తరలి రావాలని కోరుతూ అన్ని మండలాల్లో నెల రోజులుగా సమావేశాలు, ప్రచారం చేశామన్నారు. 2018 నుంచి 2023 వరకు కాఫీ ప్రాజెక్ట్ ద్వారా గత ఐదేళ్లలో కొత్తగా కాఫీ తోటల పెంపకం చేపట్టిన సుమారు 44 వేల మంది గిరిజన రైతులకు కాఫీ సాగు చేపట్టినందుకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం చెల్లిస్తున్న బకాయిలు సుమారు రూ.60 కోట్లు పేరుకు పోయాయని, ఐటీడీఏ అధికారులు మాత్రం 39 కోట్లు బకాయిలు చెల్లించవలసి ఉన్నట్లు చెబుతున్నారని పేర్కొన్నారు.
పాడేరు మండలంలోని గుత్తులపుట్టు వారపు సంతలో కాఫీ రైతుల ధర్నాపై ప్రచారం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం పాడేరు మండల అధ్యక్షుడు సోమిలి చిట్టిబాబు, మండల నాయకులు బొజ్జన్న, నానాజీ, కుర్ర మోహన్ బాబు, మత్స్యరాజు, పలు గ్రామాల కాఫీ రైతులు పాల్గొన్నారు.










