Nov 23,2022 00:10

మాట్లాడుతున్న గిరిజన సంఘం నేత సురేంద్ర

ఆంధ్రప్రదేశ్‌ గిరిజన కాఫీ రైతుసంఘం డిమాండ్‌
కాఫీకి గిట్టుబాటు ధర కల్పించాలని వినతి
పాడేరులో భారీ ర్యాలీ..ఐటిడిఎ వద్ద ధర్నా
పది మండలాల నుంచి భారీగా వచ్చిన రైతులు
ప్రజాశక్తి -పాడేరు
: పాడేరు ఏజెన్సీలో కాఫీ సాగు చేస్తున్న గిరిజన రైతులకు కాఫీ బోర్డు, ఐటిడిఎ ద్వారా ప్రభుత్వపరంగా చెల్లించాల్సిన నాలుగేళ్ల ప్రోత్సాహక బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన కాఫీ రైతుసంఘం డిమాండ్‌ చేసింది. మంగళవారం పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించి, ఐటిడిఎ వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. .ఈ సందర్భంగా గిరిజన కాఫీ రైతుల సంఘం గౌరవాధ్యక్షుడు, ఎపి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు మాట్లాడుతూ గిరిజన రైతుల పండిస్తున్న అరుకు కాఫీకి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందని, ఒక కప్పు కాఫీకి రూ.100 నుంచి రూ. 300లు తీసుకుంటున్నారని, రైతులు పండించే కాఫీ కిలోకు రూ.300 చెల్లించలేని దౌర్భాగ్య పరిస్థితి ఉండడం విచారకరమన్నారు. కాఫీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, సుంకరమెట్ట సర్పంచ్‌ గమ్మెలి చినబాబు మాట్లాడుతూ కాఫీ రైతులకు ప్రోత్సాహక బకాయిలు చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. వేసవిలో ఎండలకు కాఫీ తోటలు దగ్ధమై రైతులు నష్టపోతున్న పరిస్థితుల్లో వీటికి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. రైతుల సౌలభ్యం కోసం . ప్రతి మండలంలోకాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.
ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ కాఫీ సాగు ప్రోత్సాహంలో గిరిజన రైతులకు అన్యాయం జరుగుతోందని, దీనిపై రైతుల్లో నిరాశ నెలకొందన్నారు. కాఫీ రైతుల పొట్ట కొట్టొద్దని, కాఫీ ప్రగతికి అడ్డు పడొద్దని కోరారు. కాఫీకి గిట్టుబాటు ధర కల్పించకపోతే, మన్యంలో కాఫీకి భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. కాఫీ ప్రోత్సాహక బకాయిలపై అధికారులు లెక్కలు తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటిడిఎ ఎపిఒ వెంకటేశ్వరరావుకు అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీనిచ్చారు.

గిరిజన కాఫీ రైతుల డిమాండ్స్‌
-.కాఫీ ప్రోత్సాహక బకాయి రూ. 60 కోట్లు చెల్లించాలి
- కాఫీ గింజలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి.
-.ఉచితంగా కాఫీ డ్రయిండ్‌ యార్డులు, బేబీ పల్పింగ్‌ యూనిట్స్‌ ఇవ్వాలి.
- కాఫీ ప్రోత్సహక నిధులు ఎకరాకు రూ.50 వేలు పెంచాలి.
- కాఫీ తోటలకు ప్రమాదబీమా కల్పించాలి.
- ఎకరాకు రూ.2లక్షల వరకు వడ్డీలేని రుణం ఇవ్వాలి
- కాఫీ, మిరియాల మొక్కలు రైతులకు ఉచితంగా పంపిణీ చెయ్యాలి.
- కాఫీ సాగులో ఉన్న అటవీ భూములకు పోడు పట్టాలివ్వాలి.
- కాఫీ రైతుల పిల్లలకు స్కాలర్‌షిప్స్‌ వెంటనే ఇవ్వాలి.
- ఆర్గానిక్‌ సర్టిఫికేట్లు అందించి మార్కెటింగ్‌ సదుపాయలు కల్పించాలి.
- రైతులకు ఉచితంగా నిచ్చెనలు, కట్టర్లు, టార్పాలిన్లు అందించాలి
-.కాఫీ రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలి.
-జిసిసి ద్వారా రుణాలు, కాఫీ, మిరియాలు కొనుగోళ్లు చేయాలి.
-పాత తోటల అభివృద్ధికి ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలి.
- కాఫీ తోటలు అభివృద్ధికి నీడ మొక్కలు ఉచితంగా అందించాలి.