ప్రజాశక్తి-అరకులోయ:గిరిజన కాపీ, మిరియాల రైతులు దళారుల చేతిలో తూకాల విషయంలో మోస పోకుండా గిట్టుబాటు ధర అధికారికంగా ప్రకటించాలనికాఫీ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా (సిఎఫ్‌ఎఫ్‌ఐ) ఉపాధ్యక్షులు గెమ్మెలి చిన్నబాబు డిమాండ్ చేశారు. ఐటీడీఏ పిఓ, సంబంధిత అధికారులు కాఫీ, మిరియాలకు గిట్టుబాటు ధర అందించే విషయంలో విఫల్యం చెందారని తెలిపారు. గురువారం స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాంది, టేనేజర్ వంటి ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే రైతుల దగ్గర నుండి కాపీ సేకరిస్తున్నాయని, గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన ధరకు కొనుగోలు చేస్తామని అధికారుల ప్రకటనలు పత్రికలకే పరిమితం అవుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, ఐ.టి.డి.ఏ అధికారులు, కాపీ బోర్డు స్పష్టమైన ధర ప్రకటించకుండా కాలయాపన చేయడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపీ బోర్డు మెంబర్లుగా ఉన్న సభ్యులు దళారులకు, ప్రైవేటు వ్యక్తులకు లొంగి పోకుండా రైతులకు ఖచ్చితమైన గిట్టుబాటు రేటుతో కాఫీ, మిరియాలు కొనుగోలు చేసే విధంగా అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అనేక రాష్ట్రాల్లో కేజీ కాఫీ రూ.500 పైబడి కొనుగోలు చేస్తూ ఉంటే ఆర్గానిక్ ఏజెన్సీ కాపీని తక్కువ ధరతో కొనడం సరికాదన్నారు. గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులు వేచి ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రచారానికి పరిమితం కాకుండా కాపీ పంట నిలువ చేయడానికి గిడ్డంగులు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి కాపీ, మిరియాల కొనుగోలుపై స్పందించక పోవడం బాధాకరమన్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో పండుతున్న కాపీని కిలో రూ.500, మిరియాలు కేజీ రూ.1000లకు కొనుగోలు చేయాలని, కాపీ రైతులకు వడ్డీ లేని రుణం, ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. రైతులకు బేబీ పల్పర్లు, నిచ్చెనలు కాపీరైతులకు అందించాలని చినబాబు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి పాంగి రామన్న, కాపీ రైతు సంఘం నాయకులు తామల జోషి పాల్గొన్నారు.










