ప్రజాశక్తి -పాడేరు: పాడేరు ఏజెన్సీలో కాఫీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీఎఫ్‌డిసి డివిజనల్ మేనేజర్ జి.కృష్ణబాబుకు శుక్రవారం సిఐటియు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ, కాపీ కార్మికులకు ప్రతి సంవత్సరం పెంచవలసిన వీడిఏ పాయింట్ల ప్రకారం, రోజువారి కూలి రేట్లు పెంచాలని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాఫీ తోటలో పని చేస్తున్న దిగువ స్థాయి సిబ్బంది(హెల్పర్స్) కు కనీస వేతనం రూ.26 వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టులలో సిబ్బంది నియామకం చేపట్టాలని, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సమస్యలు పరిష్కారం చేయాలని తెలిపారు. రోజువారి కూలి రేట్ల ప్రకారం సీజన్లో నైట్ వాచ్మెన్‌లకు వేతనం, సేఫ్టీ పరికారాలు ఇవ్వాలన్నారు. క్వార్టర్స్ పరిధిలో ఉన్న కార్మికులకు మంచి నీరు, విద్యుత్ కల్పించాలన్నారు. క్వార్టర్స్ రిపేర్లు, తోటలో జరిగే ప్రమాదాలు నివారణ చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎల్ సుందర్రావు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పి.లక్కు, కామరాజు తదితరులు పాల్గొన్నారు.










