Mar 13,2023 23:27

కాపులుప్పాడ డంపింగ్‌ యార్డ్‌ను పరిశీలిస్తున్న కమిషనర్‌ రాజాబాబు

ప్రజాశక్తి -మధురవాడ : కాపులుప్పాడ డంపింగ్‌ యార్డ్‌, జిందాల్‌ విద్యుత్‌ ప్లాంట్‌, ముడసర్లోవ, మర్రిపాలెం తదితర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్‌ పి.రాజాబాబు సోమవారం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, జి -20 సదస్సుకు 40 దేశాల నుంచి 80 మంది ప్రతినిధులు విచ్చేయుచున్నారని తెలిపారు. ప్రతినిధులు నగరంలో పలు ప్రాజెక్టులు వీక్షిస్తారని, అందుకు ఆయా ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు అధికారులను ఆదేశించమని తెలిపారు. కాపులప్పాడ డంపింగ్‌ యార్డ్‌, జిందాల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. జిందాల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ వద్ద టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని, పారిశుధ్య పనులు పక్కాగా నిర్వహించాలని, ప్లాస్టిక్‌ ఎక్కడ కనిపించకూడదని, పాడైన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు మొక్కలకు నీరు పోయాలని ఆదేశించారు. ముడసర్లోవ సోలార్‌ ప్లాంట్‌ పరిసరాలు పచ్చదనంగా ఉండేటట్లు చూడాలని, రోడ్డు సెంటర్‌ డివైడర్‌లో బోగన్‌ విల్లా ప్లాంటేషన్‌ వేసి పరిరక్షించాలన్నారు. అనంతరం మర్రిపాలెం తాగునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. స్తంభాలకు కేబుల్‌ వైర్లు వేలాడకుండా చూడాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు, జోనల్‌ కమిషనర్లు కనకమహాలక్ష్మి, ఆర్‌జివి.కృష్ణ, డిడి హెచ్‌.దామోదరావు, పర్యవేక్షక ఇంజనీర్లు పాల్గొన్నారు.