ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపులకు పెద్దపీట వేస్తూ కోటి 50 లక్షల మంది కాపులకు అన్నివిధాలా అండగా నిలిచిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని బాపట్ల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిట్టా ప్రమీలారాణి అన్నారు. గురువారం బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన టిడిపి కాపు నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ కాపుల విషయంలో తెలుగుదేశం పార్టీపై చేసిన విమర్శలను కాపు నాయకులు తీవ్రంగా ఖండించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ వాస్తవాలను తెలుసుకోకుండా జగన్ మెప్పు కోసం కాపుల విషయంలో తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాపు రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన అంశం కొట్టుకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. తుని రైలు దహన ఘటనలో రైలును తగులబెట్టింది వైసీపీ నాయకులు కాదా అని నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీపై నెపం మోపి సంబంధం లేకపోయినా చంద్రబాబును అందులోకి లాగిన వాస్తవం మీకు తెలీదా అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తొలిసారిగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక లోటు ఉన్నప్పటికీ రూ.3,100 కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు భీమా లీలాకృష్ణ, విన్నుకోట వీరయ్య నాయుడు, మద్దుల వీర కొండలరావు, అనిశెట్టి బసవయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దాది పిచ్చయ్య, వళ్ళంసెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.










