ప్రజాశక్తి-గోపాలపట్నం : నేవల్ డాక్‌యార్డు ఉద్యోగులు తమ సొంత నిధులతో కాకానినగర్ జంక్షన్ వద్ద నిర్మించిన కాపు సామాజిక భవనాన్ని ఆదివారం భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సొంత నిధులతో కాపు సామాజిక భవనాన్ని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ఉద్యోగుల సమిష్టి కృషి వల్ల ఈ నిర్మాణం జరిగిందన్నారు. భవిష్యత్తులో తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, రూ.ఐదు కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ భవనం కాపు సామాజి వర్గానికి అన్ని విధాలా ఉపయోగపడుతుందన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు మాట్లాడుతూ, సొంత నిధులతో నిర్మించిన ఈ భవనం పూర్తి హక్కులు వారికే ఉంటాయన్నారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం కాపులకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు చిరంజీవి, భాస్కరరావు, బిజెపి నేత జనపరెడ్డి పృథ్వీరాజ్, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కాపు సామాజిక వర్గం ప్రతినిధులు పాల్గొన్నారు.










