Oct 06,2023 23:53

కాన్వెంట్‌ స్కూలు పిల్లల వ్యాన్‌ బోల్తా -ముగ్గురికి స్వల్ప గాయాలు - తప్పిన పెను ప్రమాదం

కాన్వెంట్‌ స్కూలు పిల్లల వ్యాన్‌ బోల్తా
-ముగ్గురికి స్వల్ప గాయాలు - తప్పిన పెను ప్రమాదం
ప్రజాశక్తి- దొరవారిసత్రం :తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండల కేంద్రంలో కాన్వెంట్‌ వ్యాన్‌ బోల్తా కొట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దొరవారిసత్రం లో గత 20 ఏళ్లుగా విద్యా వికాస్‌ అను పేరుతో కాన్వెంట్‌ నడుస్తోంది. పిల్లలను వ్యాన్లో సమీప గ్రామాల నుండితరలిస్తుంటారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఏకొల్లు గ్రామంలో నుండి పిల్లలను తీసుకొని కాన్వెంట్‌ కు బయలుదేరింది. దొరవారిసత్రం గ్రామంలోని గతుకుల రోడ్డుపై మలుపు వద్ద తిరుగుతుండగా అదుపుతప్పి నేషనల్‌ హైవే పక్కనే ఉన్న సర్వీస్‌ రోడ్డుపై పడిపోయింది. ఈ సంఘటన చూసిన పలువురు హుటాహుటిన అక్కడికి చేరుకొని బోల్తా పడిన వ్యాన్‌ ను చక్రాలపై నిలబెట్టారు. ఈ ప్రమాద సంఘటనలో జతిక్‌ (రెండవ తరగతి), రాహుల్‌ (యూకేజీ), గీతిక (రెండవ తరగతి) పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాద సంఘటనలో అక్కడ పరిస్థితిని చూసినవారు పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన పిల్లలను హైవే మొబైల్‌ అంబులెన్స్‌ సిబ్బంది సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ఈ సంఘటన తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఒక్క పరుగున ప్రమాద స్థలానికి చేరుకుని వారి పిల్లలను హక్కున చేర్చుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని వ్యాన్‌ ను, డ్రైవరును విచారణ నిమిత్తం స్టేషన్‌ కు తీసుకువెళ్లారు.