May 03,2021 12:25

   మట్టిలేకుండా చిన్నపాటి గాజు పాత్రల్లో నీటిలో పెరిగే అపురూప మొక్కలు గుడ్‌ లక్‌ బెంబోలు. విభిన్న ఆకారాల్లో కొలువుదీరి ఆహా అనిపించే వీటిని లక్కీ బెంబోలు అని కూడా అంటుంటారు. వెదురు జాతి మొక్కలుగా పిలిచే ఇవి పరోక్ష సూర్యకాంతిలో బాగా పెరుగుతాయి. ఇది ఇండోర్‌ మొక్క. వంద నుంచి లక్ష రూపాయలు విలువచేసే గుడ్‌లక్‌ బెంబో మొక్కల గురించి మరెన్నో విశేషాలు ఈ వారం ...
   నిజానికి ఇది డ్రాకేనా సాండెరియానా అని పిలువబడే ఒక రకమైన ఉష్ణమండల నీటి కలువ. ఇది చైనా దేశ మొక్క. పురాతన చైనా సంస్కృతిలో ఈ మొక్క ఒక భాగం. ఇప్పటికీ చైనీయులు ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టంగా భావిస్తుంటారు. ఈ మొక్కలతో చైనా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేస్తుంది. వందల కోట్ల వాణిజ్యం ఈ మొక్కల ద్వారా జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదేమో! ముఖ్యంగా కానుకలు ఇచ్చి పుచ్చుకోవడానికి ఈ మొక్కలు ప్రసిద్ధమైనవి. వీటి స్టిక్కులకు రిబ్బన్తో లేదా ఆకృతుల్లో కట్ట కట్టి తయారు చేస్తారు. కట్టిన కాడల సంఖ్యను బట్టి చైనీయుల సంస్కృతిలో వీటికి ఒక్కో కథనాలున్నాయి. ఆకుపచ్చ, లేత పసుపు చాయలలో ఈ మొక్కలు లభ్యమౌతున్నాయి. ఈ మొక్కల్లో రంగులు సృష్టించేందుకు చైనాలో పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

                                                                     లూస్‌ స్టిక్స్‌ మొక్కలు 

 లూస్‌ స్టిక్స్‌ మొక్కలు 

   పొడవాటి బెంబో స్టిక్స్‌ను విడివిడిగా ఒక గాజు పాత్రలో అలంకారంగా ఉంచి పెంచుతారు. గాజు పాత్రలో క్లోరినేట్‌ చేయని నీటిని పోయాలి. వారానికి ఒకసారి నీటిని మార్చడం శ్రేయస్కరం. ఈ బెంబొస్టిక్స్‌ని రకరకాల ఆకృతుల్లో మలచవచ్చు. ఇవి కింద కర్రల్లా, పైన ఆకుపచ్చని ఆకులతో ఎంతో శోభాయమానంగా ఆకట్టుకుంటాయి. టీపాయల మీద అలంకరించుకోవడానికి ఇవి ఎంతో బాగుంటాయి.

                                                                   గిఫ్ట్‌ లక్కి బేంబో

   నర్సరీల్లోనే కాకుండా బయట మార్కెట్లోనూ విక్రయించే బెంబో మొక్క గిఫ్ట్‌ లక్కి బేంబో. చిన్న బౌల్లో నాలుగు నుంచి ఎనిమిది అంగుళాల వరకూ ఈ మొక్క పెరుగుతుంది. ఇంట్లో మనకు ఇష్టమైన ప్రదేశంలో పెంచుకోవచ్చు. ఆకుపచ్చని స్టిక్స్‌కు ఎర్రని రిబ్బన్‌ కట్టి ఉంటుంది. కానుకలు ఇచ్చుకోవడానికి ఇవి చక్కని మొక్కలు.

                                                                     స్టెప్స్‌ గుడ్‌ లక్‌ మొక్కలు

 స్టెప్స్‌ గుడ్‌ లక్‌ మొక్కలు

   నిండుగా గుడ్‌ లక్‌ బెంబోలు స్టిక్‌లతో ఒత్తుగా చాలారకాలు స్టెప్స్‌ ఉండే మొక్క ఇది. అడుగు నుంచి నాలుగడుగులు ఎత్తు వరకూ ఉంటుంది. దీనిని వెడల్పాటి గాజుపాత్రలో పెంచుతారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మొక్క పదేళ్ళ వరకూ పెరుగుతుంది. దీనిని ఇంట్లో, హల్లోనూ అలంకరణకు పెంచుకోవచ్చు.


                                                            షిప్‌ గుడ్‌లక్‌ మొక్కలు

   గుడ్‌ లక్‌ బేంబోల్లో అత్యంత విలువైనది షిప్‌ బేంబూ మొక్కలు. ఇవి అచ్చంగా ఓడను పోలుంటాయి. బేంబో స్టిక్స్‌తో ముందుగా ఇలాంటి నిర్మాణం చేస్తారు. ఇవి క్రమేపీ అదే రీతిలో ఎదుగుతుంది. మొక్క ఎదిగే కొద్దీ ప్రత్యేకమైన అందం ఉంటుంది. హోటల్స్‌, రిసార్ట్స్‌, అతిథి గృహాలు, స్టార్‌ ఫంక్షన్‌ హాళ్లలో ప్రత్యేక లైటింగ్‌ ఫోకస్‌తో వీటిని పెంచుతారు. ఎక్కడ ఉన్నా ఇవి వాటి అందంతో మైమరిపిస్తాయి. ఆరునెలలకొకసారి వీటిని ట్రిమ్‌ చేయాల్సి ఉంటుంది.


                                                                    నెట్‌ గుడ్‌లక్‌ మొక్కలు

నెట్‌ గుడ్‌లక్‌ మొక్కలు

   వల అల్లినట్టుగా, జల్లెడ మాదిరిగా ఉండే మొక్కలు నెట్‌ గుడ్‌ లక్‌ మొక్కలు. కాండము భాగము తడికిలా అల్లికలతో ఉంటుంది. పైన ఆకులతో మొక్క కళకళలాడుతుంటుంది. కింద వాటర్‌ బౌల్లో రంగు రంగు గులకరాళ్లు వేసుకుంటే మరీ అందంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఎక్కువమంది ఈ మొక్కను అలానే పెంచుతున్నారు.


                                                                        బల్బ్‌ మొక్కలు

 బల్బ్‌ మొక్కలు

   మొక్క కాండం భాగం బల్బు మాదిరిగా స్టిక్స్‌తో అల్లి ఉంటుంది. పైన చిగురుటాకులు చక్కగా కిషలయ విన్యాసం చేస్తుంటాయి. ఈ మొక్క ఎంతో అందంగా ఉంటుంది. దీని ఖరీదు కూడా వేలల్లో ఉంటుంది. నీటిలో పిహెచ్‌ విలువ సమానంగా లేకుండా ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటే ఈ మొక్కలు చనిపోతాయి.


                                                          టవర్‌ గుడ్‌లక్‌ బెంబో

   గుడ్‌లక్‌ స్టిక్స్‌ని పెనవేసినట్లు, తాడు అల్లినట్టు మొదలు భాగం ఉంటుంది. సన్నగా పొడవుగా టవర్‌ మాదిరిగా ఉండి పైన ఆకులు విచ్చుకుంటాయి. మొక్క తేజోవంతంగా చూడ్డానికి భలే గమ్మత్తుగా ఉంటుంది. టీపాయి, అల్మారా, ధర్వాజా ఇలా ఇంటిలోపల వీటిని ఎక్కడైనా పెంచుకోవచ్చు.

                                                             ఆర్చీ ప్లాంట్‌
త్రిభుజాకారంగా తడికలా ఉండి దాని చిగురు భాగాల్లో ఆకులతో అలరించే మొక్కే ఆర్చీ ప్లాంట్‌. కొన్ని అర్ధచంద్రాకారంగా కూడా ఉంటాయి. ఆర్చీ ప్లాంట్లు కూడా కాస్త ధర ఎక్కువే. అర్బన్‌ దేశాల్లో వీటికి గిరాకీ ఎక్కువ.

                                                            వాజ్‌ ప్లాంట్‌

సన్నని పొడవాటి పాత్ర ఆకారాల్లో కాండం ఉండి దాని అంచులు ఆకులతో రెపరెపలాడుతుంటాయి. విభిన్నమైన పాత్రలు ఆకారాల్లో ఈ మొక్కలుంటాయి.
 

                                                             తడిక ప్లాంట్‌
దడి కట్టినట్లు ఉండే బేంబు స్టిక్స్‌ మొక్క చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. కింద తడికలా, పైన రెపరెపలాడే ఆకులతో కనువిందు చేస్తుంది.
 

- చిలుకూరి శ్రీనివాసరావు,
8985945506