Dec 06,2022 23:42

పిటిజి గిరిజనులతో మాట్లాడుతున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి -అనంతగిరి: దేశానికి స్వాతంత్య్ర వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆదివాసి పీటిజి పేద గిరిజనులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పలాలు అందని ద్రాక్షగానే మిగిలింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి పీటిజిలకు అధికంగా పథకాలు అందిస్తున్నట్లు ప్రచార ఆర్భాటాలు చేస్తున్నాయి తప్ప ఆచరణలో మాత్రం అమలు కాలేదు.
అల్లురి సీతారామరాజు జిల్లా అనంతగిరి పంచాయతీ తేనేపుటు, తెల్లరపాడు, వాలసి పంచాయతీ పుటపాడులోని వివిధ పీటీజి గ్రామాలకు నేటికీ విద్య, వైద్యం చిన్నారులకు, గర్బిణి, బాలింతలకు అందలేదు. పౌష్టికహారం అందించిన దాఖలాలు లేవు.కనీసం అంగన్వాడీ కేంద్రం భవనం కూడా లేని పరిస్థితి నెలకొంది. గిరిజనులు ఎవరైనా అనారోగ్యానికి గురై నప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని పరిస్థితి నెలకొంది. తేనేపుటులో 12మంది, తెలరుపాడు, పుటపాడులో 25 మంది విద్యార్థులు ఉన్నపటికీ పాఠశాల లేక విద్యకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. బాలింతలు అంగన్వాడి కేంద్రానికి గెడ్డలు, కొండలు దాటి రేగం గ్రామానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. తెలరాపాడు, పుటపాడు గ్రామాలకు చెందిన 25 మంది విద్యార్థులు, చిన్నారులు 32, బాలింతలు 11, గర్బిణలు 8 మంది పౌష్టికాహారం కోసం వాలసి పంచాయతీ సుమారు 3.కిల్లో మీటర్లు దూరం చీమగెడ్డ, బొడ్డెపాడు చేరుకున్ని రాయిపాడుకు వెళ్లాల్సి ఉంది. సరైన పౌష్టికాహారం అందక గర్బిణిలు, బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్నారు.
పీటీజి గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీపీఎం మండల కార్యదర్శి ఎస్‌.నాగులు, ఉప్ప సర్పంచ్‌ అర్జున్‌, వార్డు మెంబర్‌ జె.సుబ్బారావు డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదిమ జాతి గిరిజనులపై నిర్లక్ష్యం తగదని తెలిపారు. తక్షణమే పాఠశాల, అంగన్వాడీ వంటి సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు.జిల్లా కలెక్టర్‌, పిఓల దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.