ప్రజాశక్తి-మాడుగుల:అట్టహాసంగా ప్రారంభం కావలసిన గ్రంథాలయ వారోత్సవాలు మొట్టమొదటి రోజున బోసిపోయాయి. ఈనెల 14 నుండి 20 తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాల్సి ఉంది. ప్రతి ఏటా మొదటి రోజు ఈ ఉత్సవాలు అట్టహాసంగా జరిగేవి. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ప్రారంభోత్సవాలు నిలిచిపోయాయి. ప్రతి ఏడాది మాదిరిగా కాకుండా జిల్లా కేంద్రంలో అధికార పార్టీకి చెందిన బడా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రారంభోత్సవం ఏర్పాటు చేయడమే. బడా నేతలను ప్రసన్న చేసుకునేందుకు జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు విమర్శలు వినబడుతున్నాయి. గ్రంథాలయాలకు చెందిన నేతలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. వైసీపీ పార్టీకి చెందిన బడా నేతను ప్రసన్న చేసుకునేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని, గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో ప్రారంభించవలసిన గ్రంథాలయ వారోత్సవాలు మాత్రం ప్రారంభం కాలేదు. మొదటి రోజున గ్రంధాలయాలలో బాలల దినోత్సవ వేడుకలతో పాటు పతాకావిష్కరణ, ప్రారంభ వేడుకలు జరగాల్సి ఉంది. గ్రంథాలయాల పట్ల పలువురికి ఆసక్తి కలిగించేందుకు గ్రంథాలయ ఉద్యమం స్ఫూర్తి కలిగించేందుకు అనేక సంవత్సరాలుగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది కొత్తగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం విడ్డూరంగా మారింది. మొదటిరోజు కార్యక్రమం లేకపోగా తర్వాత కార్యక్రమాలు అయినా స్థానిక గ్రంథాలయాలలో నిర్వహిస్తారా లేదా జిల్లా కేంద్రంలో చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రారంభం కాని వారోత్సవాలు
నర్సీపట్నంటౌన్: ప్రతి ఏటా నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాలు నర్సీపట్నంలో కాన రాలేదు. ప్రారంభానికి నోచుకోలేదు. ప్రతి ఏటా 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది స్థానిక శాఖ గ్రంథాలయంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు లైబ్రేరియన్ ఈ నెల 12న మీడియాకు తెలిపారు. అయినప్పటికీ శాఖ గ్రంధాలయంలో వారోత్సవాలు కాన రాలేదు.యువత సర్వతోముఖాభివృద్ధికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఆధునిక యుగంలో విద్యార్థులకు, ఉద్యోగార్థులకు, నిరుద్యోగులకు విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలే ప్రధాన ఆధారంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వారోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ రకాల పోటీలు ప్రాధమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తారు.స్థానిక గ్రంథాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో నిరాశతో పాఠకులు వెనుతిరిగారు. దీనిపై లైబ్రేరియన్ రాజును వివరణ కోరగా.. జిల్లా కేంద్రంలో వారోత్సవాలు జరుపుతామని ఉన్నతాధికారులు తెలియజేయడంతో అక్కడికి వెళ్ళామని, రేపటి నుంచి వారోత్సవాలు కొనసాగిస్తామని తెలిపారు.










