ఇద్దరికీ తీవ్రగాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
ప్రజాశక్తి -గోపాలపట్నం/ కంచరపాలెం : విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుళ్లపై మద్యం మత్తులో అపార్ట్‌మెంట్ వాచ్‌మ్యాన్ దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన గురువారం అర్థరాత్రి కాకానినగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం...కాకానినగర్‌లోని సాయిప్రియ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న గోపి అనే వ్యక్తి అప్పటికే పెళ్లయి, ముగ్గురు పిల్లలున్న వితంతు మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అపార్ట్‌మెంట్ సమీపంలోనే టిఫిన్ దుకాణాన్ని కూడా నిర్వహించేవారు.దీంతో మరింత అసహనానికి గురైన గోపి, గురువారం రాత్రి పూటుగా మద్యం తాగి, ఆ మత్తులో అపార్టుమెంట్‌లో నానారబస చేశాడు. ఇంట్లోని సామాన్లు విసిరేయడంతోపాటు నానా బీభత్సం సృష్టించాడు. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో రామకృష్ణ, కిశోర్ అనే ఇద్దరు సంఘటనాస్థలికి చేరుకుని నానా గొడవ సృష్టిస్తున్న గోపిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తగ్గకపోగా, తన వద్దనున్న సుత్తితో ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడికి దిగాడు. ఈ ఘటనలో కానిస్టేబుళ్లిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుళ్లను సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో ఆరోగ్యభద్రత పథకం చేర్పించి వైద్యసేవలు అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జరిగిన ఘటనలపై కేసు నమోదు చేసిన ఎయిర్‌పోర్టు పోలీసులు, నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.










