ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్
నగర పరిసరాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాలను ఏలూరు రేంజ్ డిఐజి జి.పాలరాజు, జిల్లా ఎస్‌పి రాహుల్‌దేవ్‌శర్మ ఆదివారం తనిఖీ చేశారు. పాలరాజు నగరంలో ఏర్పాటు చేసిన 24 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ప్రిలిమినరి పరీక్షలకు 14,228 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 12,524 మంది హాజరయ్యారు. కొంతమంది అభ్యర్థులు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకురాకపోవడం, గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ లేకుండా కొంతమంది అభ్యర్థులు రాగా వారి వద్ద నుంచి డిక్లరేషన్ తీసుకుని పరీక్షకు అనుమతించినట్లు డిఐజి పాలరాజు తెలిపారు. పరీక్షా కేంద్రాలను ఏలూరు ఇన్‌ఛార్జి డిఎస్‌పి పైడేశ్వరరావు, జంగారెడ్డిగూడెం డిఎస్‌పి కెవి.సత్యనారాయణ, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ వి.రవికుమార్, ఏలూరు సిఐలు బి.ఆదిప్రసాద్, చంద్రశేఖర్, వరప్రసాద్ పర్యవేక్షించారు.










