ప్రజాశక్తి-విజయవాడ: డివైఎఫ్‌ఐ సుదీర్ఘ పోరాటం ఫలితంగా గత నవంబర్ 28న రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోలీస్ కానిస్టేబుల్ 6100, ఎస్సై 411 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్న అన్నారు. ఈ నెల 18న నిర్వహించే పోలీస్ కానిస్టేబుల్ మోడల్ పరీక్ష పోస్టర్‌ను బుధవారం స్థానిక బాలోత్సవ భవన్‌లో డివైఎఫ్‌ఐ ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి కృష్ణ, ఎన్ నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పోలీసు శాఖలో నోటిఫికేషన్ లేనందున వయోపరిమితి ఐదు సంవత్సరాలకు పెంచాలని డివైఎఫ్‌ఐ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిందన్నారు. అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలకు వయోపరిమితి పెంచిందని తెలిపారు. ఈ నెల 22న ప్రిలిమ్స్ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులకు ఈ మోడల్ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రముఖ విద్యావేత్త ఎమ్మెల్సీ కె.యస్.లక్ష్మణరావు పర్యవేక్షణలో ప్రశ్నాపత్రం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పరీక్ష పట్ల భయాందోళన లేకుండా, పరీక్ష పత్రం పట్ల అవగాహన కోసమే ఈ మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 18న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ అన్ని జిల్లాల్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ ఎన్.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.










